Ambati Rambabu: సీఎం జగన్ పై బీజేపీ నేతల ఆరోపణలు కరెక్టు కాదు: అంబటి రాంబాబు

  • లాక్ డౌన్ ప్రభావంతో  సామాన్యుడు బయటకు రాలేని పరిస్థితి
  • పేదలకు అండగా మా ప్రభుత్వం పనిచేస్తోంటే విమర్శలా?
  • కేంద్రం సాయాన్ని రాష్ట్రం ఇస్తున్నట్టుగా చెప్పుకోవట్లేదు
Ambati Rambabu criticises BJP

లాక్ డౌన్ ప్రభావంతో సామాన్యుడు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉండటంతో పేదలకు నిత్యావసరాలతో పాటు వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సాయం పంపిణీ చేస్తున్న ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హితవు పలికారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా సీఎం జగన్ చెప్పుకుంటున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం కరెక్టు కాదని అన్నారు.  

తెల్లరేషన్ కార్దుదారులకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తున్న డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానివేనని, ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఇటీవల విడుదలయ్యాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని భావిస్తున్న ప్రతిపక్షాలు ఇలాంటి బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నాయని మండిపడ్డారు. గ్రామ వాలంటీర్లు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు. తెల్లరేషన్ కార్డుదారులకు వెయ్యి రూపాయలు పంపిణీ చేసే సమయంలో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని వాలంటీర్లు చెబుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు.

More Telugu News