Team India: లాక్‌డౌన్‌ తప్పదని మేం ముందే ఊహించాం: రవిశాస్త్రి

  • కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇలాంటి పరిస్థితి తప్పదనుకున్నాం
  • న్యూజిలాండ్‌ నుంచి వస్తున్నప్పుడే క్రికెటర్లు కంగారు పడ్డారు
  • ఇప్పుడు క్రికెట్ కాదు.. ప్రజల భద్రత గురించే ఆలోచించాలన్న కోచ్
Ravi Shastri and team anticipated coronavirus crisis

కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచం స్తంభించిపోయింది. చాలా దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దేశ సరిహద్దులే కాదు.. రాష్ట్రాలు.. గ్రామాల మధ్య సరిహద్దులు కూడా మూతపడ్డాయి. ఈ మహమ్మారి దెబ్బకు  క్రీడారంగం కుదేలవగా  క్రికెట్ పూర్తిగా ఆగిపోయింది. అయితే, ఈ పరిస్థితిని తాము ముందే ఊహించామని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి తెలిపాడు.

 ప్రపంచ వ్యాప్తంగా క్రీడలు స్తంభించిపోయే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా, భారత్ మధ్య వన్డే సిరీస్‌ రద్దయిన సమయంలోనే భారత క్రికెటర్లకు తెలుసన్నాడు. ఈ సిరీస్‌ కంటే ముందు టీమిండియా.. న్యూజిలాండ్‌లో పర్యటించింది. అయితే, భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన సమయంలోనే మన క్రికెటర్లు స్వదేశానికి వచ్చారని శాస్త్రి చెప్పాడు.

ఇక ఈ సిరీస్‌కు సిద్ధమవుతున్నప్పుడే వైరస్ ప్రభావాన్ని ఊహించామని, దాని వల్ల ఏదో జరుగుతుందని అనుకున్నామని తెలిపాడు. ఈ నెల రెండో వారంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ రద్దవడం క్రికెటర్లను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. దాంతో, దేశంలో లాక్‌డౌన్‌ లాంటి పరిస్థితి తప్పదని భావించామన్నాడు.

వైరస్ ప్రభావం అధికంగా ఉందని టీమిండియా క్రికెటర్లు న్యూజిలాండ్‌లోనే ఊహించారని చెప్పాడు. సింగపూర్ నుంచి రావడంతో కాస్త ఆందోళన చెందారని, అయితే స్వదేశానికి చేరుకున్నాక ఊపిరి పీల్చుకున్నారని శాస్త్రి తెలిపాడు. జట్టు ఇక్కడికి వచ్చిన రోజు నుంచే  స్క్రీనింగ్ చేయడం మొదలు పెట్టారని, దాంతో సరైన సమయంలోనే తాము స్వదేశం చేరామనుకున్నామని చెప్పాడు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్రికెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని శాస్త్రి స్పష్టం చేశాడు. ఇప్పుడు అందరి దృష్టి ప్రజల భద్రతపైనే ఉండాలన్నాడు. ఈ వైరస్‌పై అందరికీ అవగాహన కల్పించాలని సూచించాడు. ఇందులో భారత క్రికెటర్లు ముందున్నారని చెప్పాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ సహా పలువురు ఆటగాళ్లు సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపాడు.

More Telugu News