Corona Virus: కరోనా ప్రళయాన్ని ముందే ఊహించిన సినిమాలివే!

  • వైరస్‌ను ముందే ఊహించి సినిమాలు తీసిన హాలీవుడ్
  • అన్నీ సూపర్ డూపర్ హిట్లే..
  • నేటి వైరస్‌కు అద్దం పట్టేలా నాటి సినిమాలు
Hollywood movies on Virus got sensational Hits

కరోనా వైరస్‌ను సినీ ప్రపంచం ముందే ఊహించిందా? ఈ సినిమాల గురించి తెలిస్తే నిజమేనని అనిపించకమానదు. సినిమా అంటేనే ఊహా ప్రపంచం. తమ సినిమాల కోసం విభిన్న కథలను అన్వేషిస్తుంటారు. ఈ విషయంలో హాలీవుడ్ అందరికంటే ఓ మెట్టు పైనే ఉంటుంది. జంతువులను, వైరస్‌లను కథా వస్తువుగా చేసుకోవడంలో వీరు నిష్ణాతులు. ఊహాత్మక కథనాలతో సినిమాను రూపొందించి విజయం సాధించడంలో వీరు దిట్ట. అలా రూపొందించిన యుగాంతం, ప్రళయం, వైరస్ వంటి సినిమాలు సెన్షేషనల్ అయ్యాయి.  ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలోకి నెట్టేసిన కరోనా వైరస్‌ను కూడా వీరు ముందే ఊహించారు. ఇంచుమించు ఇలాంటి కథాంశంతోనే వచ్చిన సినిమాలేవో చూద్దాం.

2007లో విడుదలైన ‘28 వీక్స్ లేటర్’ సినిమాలో ‘రేజ్’ అనే వైరస్‌ను కథా వస్తువుగా తీసుకున్నారు. ‘స్లమ్ డాగ్ మిలీనియర్’ దర్శకుడు డెన్నీ బాయ్లే ఈ సినిమాకు దర్శకుడు. ఈ వైరస్ సోకిన వారికి విపరీతమైన కోపం వస్తుంది. దీనిని నియంత్రించేందుకు తయారుచేసిన డ్రగ్‌ను ప్రయోగించేందుకు చింపాంజీలో ఓ వైరస్‌ను సృష్టిస్తారు. ఆ తర్వాత ఆ వైరస్ మనుషులకు సోకి జోంబీల్లా మారిపోతారు.  

‘ఇట్ కమ్స్ ఎట్ నైట్’ (2017) అనే సినిమాలో గుర్తు తెలియని వైరస్ మనుషులను చంపేస్తుంటుంది. ఇందులోని సీన్లు చాలా సహజంగా అనిపిస్తాయి. 2006లో వచ్చిన ‘చిల్డ్రన్ ఆఫ్ మెన్’ సినిమా కూడా ఇలాంటిదే. ఇందులో వైరస్ కనిపించదు. 2027లో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి తీసిన సినిమా ఇది. ఇదో విజువల్ వండర్. 1995లో వచ్చిన ‘12 మంకీస్’ సినిమా కూడా ఈ కోవలోకే వస్తుంది. ఈ సినిమాలోని వైరస్ వల్ల భూమ్మీది ప్రజలంతా చనిపోతారు. ఈ వైరస్‌ను నివారించేందుకు కథానాయకుడు గతానికి వెళ్తాడు.  

2008లో వచ్చిన ‘బ్లైండ్‌నెస్’ సినిమాలో ఓ వైరస్ వల్ల కళ్లు పోతాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకడంతో అందరి కళ్లూ పోతాయి. దీంతో రోగులను ప్రభుత్వం ఐసోలేషన్‌లో ఉంచుతుంది. 2013లో వచ్చిన ‘వరల్డ్ వార్ జడ్’ కూడా ఇలాంటి సినిమానే. హాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రాడ్‌పిట్ నటించిన ఈ సినిమాలో జాంబీ వైరస్ వల్ల ప్రజలు రాక్షసుల్లా మారిపోతారు. ఒకరి ద్వారా ఇది ప్రపంచమంతా సోకుతుంది. దీనిని అరికట్టేందుకు హీరో ప్రపంచదేశాల సాయం తీసుకుంటాడు. అలాగే,  2013లో వచ్చిన ‘ఫ్లూ’, 1995లో వచ్చిన ‘ఔట్ బ్రేక్’, గతేడాది వచ్చిన ‘వైరస్’, 2011లో వచ్చిన కంటేజియన్ వంటి సినిమాలు వైరస్ కథాంశంతో తెరకెక్కినవే.

More Telugu News