Chandrababu: ప్రభుత్వమే వెయిటింగ్ లో ఉంచి, ప్రభుత్వమే జీతంలో కోతపెట్టడం అమానవీయం: చంద్రబాబు

  • వెయిటింగ్ లో ఉన్న అధికారులకు జీతాలు ఇవ్వకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం
  • వైసీపీ ప్రభుత్వం ఫ్యాక్షన్ పంజా విసురుతోందంటూ మండిపాటు
  • ఉద్యోగులను లొంగదీసుకోవాలనే ఇలాంటి చర్యలంటూ విమర్శలు

వైసీపీ ప్రభుత్వ ఫ్యాక్షనిస్ట్ ధోరణి రోజురోజుకూ పరాకాష్టకు చేరుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విపక్ష నేతలు, విపక్ష కార్యకర్తలపై కక్షసాధింపుతో వారి ఉన్మాదం చల్లారడంలేదని, రైతులు, రైతుకూలీలు, మహిళలు, యువత, కార్మికులు ఇలా అన్ని వర్గాలను అష్టకష్టాలు పెడుతున్నారని, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులపైనే ఫ్యాక్షన్ పంజా విసురుతున్నారని మండిపడ్డారు.

మూడు నెలలకు మించి వెయిటింగ్ లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం చెల్లించబోమనడం, ఆరు నెలల కంటే ఒక్కరోజు వెయిటింగ్ లో ఉన్నా అసాధారణ సెలవుగా పరిగణిస్తామని అనడం వైసీపీ కక్షసాధింపు దోరణికి నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవాలనే ఇలాంటి ఉన్మాద చర్యలను ఖండిస్తున్నామని ట్విట్టర్ లో స్పందించారు.

"పోస్టింగ్ లు ఇవ్వకుండా వందల సంఖ్యలో పోలీసు అధికారులను, సిబ్బంది గత 8 నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఇప్పుడు వారికి జీతాలు కూడా చెల్లించలేది లేదంటూ ఉత్తర్వులు ఇవ్వడం దారుణం. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా వెయిటింగ్ లో ఉంటే చర్యలు తీసుకోవాలి కానీ, ప్రభుత్వమే వారిని వెయిటింగ్ లో ఉంచి, అవసరాలకు ఉపయోగించుకుని, వారిపైనే మళ్లీ చర్యలకు దిగడం అమానవీయం. ఇలాంటి ఉన్మాద ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. ప్రభుత్వం తప్పు చేసి ఆ తప్పుకు ఉద్యోగుల్ని శిక్షిస్తారా? వెయిటింగ్ లో ఉన్నవారిని 3 నెలలు కాగా జస్టిఫికేషన్ తో ఎందుకు ప్రభుత్వ సమీక్షకు పంపలేదు?" అంటూ మండిపడ్డారు.

అధికారులను వెయిటింగ్ లో పంపినవాళ్లే జీతాలు కోతపెట్టడం ఎక్కడైనా ఉందా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. మూడు నెలలకు మించి వెయిటింగ్ లో ఉన్న అధికారులకు జీతాలు చెల్లించబోమంటూ ఏపీ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో చంద్రబాబు పైవిధంగా స్పందించారు.

More Telugu News