Hazipur: హాజీపూర్ హత్యల కేసులో తీర్పు వెల్లడి .. శ్రీనివాస్ రెడ్డిని దోషిగా తేల్చిన న్యాయస్థానం

  • నల్గొండలోని పోక్సో న్యాయస్థానంలో విచారణ
  • శ్రీనివాస్ రెడ్డిని దోషిగా తేలుస్తూ తీర్పు
  • ఏ శిక్ష విధిస్తారనే విషయమై నెలకొన్న ఉత్కంఠ

నల్గొండ జిల్లా హాజీపూర్ హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని దోషిగా తేలుస్తూ న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. నల్గొండలోని పోక్సో న్యాయస్థానంలో ఇవాళ ఈ కేసు విచారణ జరిగింది. భోజన విరామ సమయం అనంతరం ఈ కేసు తీర్పును న్యాయమూర్తి వెల్లడించారు. ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం చేసి హతమార్చిన కేసుల్లో శ్రీనివాస్ రెడ్డి పై ఆరోపణలు రుజువు కావడంతో అతన్ని దోషిగా తేలుస్తూ తీర్పు వెలువరించింది. కాగా, శ్రీనివాస్ రెడ్డికి ఏ శిక్ష విధిస్తారనే విషయమై ఉత్కంఠ నెలకొంది.


మా ఇల్లు తగలబెట్టారు.. భూములు లాక్కున్నారు: నిందితుడు శ్రీనివాస్ రెడ్డి

నేడు తీర్పు వెలువరించడానికి ముందు శ్రీనివాస్ రెడ్డిని న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు. మూడు కేసుల్లో నేరం రుజువైంది కనుక శిక్ష విషయమై చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? అని అతన్ని న్యాయస్థానం ప్రశ్నించగా, ఈ కేసులతో తనకు సంబంధం లేదని చెప్పాడు. తనపై కోపంతో గ్రామంలోని తమ ఇంటిని తగలబెట్టారని, భూములు లాక్కున్నారని, దీంతో, తన తల్లిదండ్రులు దిక్కులేని వాళ్లయ్యారని చెప్పాడు. శిక్ష గురించి చెప్పుకునేదేమన్నా ఉందా? అనే ప్రశ్నకు శ్రీనివాస్ రెడ్డి అదే సమాధానం చెప్పినట్టు సమాచారం.

మూడు నెలలు.. 101 మంది సాక్షుల విచారణ

యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్ గ్రామంలో ముగ్గురు అమ్మాయిలను శ్రీనివాస్ రెడ్డి కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారం చేసి వారిని హతమార్చాడు. ఈ ఘటనలకు సంబంధించి గత ఏడాది ఏప్రిల్ లో అతనిపై మూడు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలకు ముందే కర్నూలులో కూడా ఈ తరహా హత్యకు శ్రీనివాస్ రెడ్డి పాల్పడ్డాడు. ఈ కేసుల విచారణకు సంబంధించి దాదాపు మూడు నెలల పాటు 101 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది.

More Telugu News