tihar jail: జైలులో ఫోన్ నియంత్రణ మా వల్ల సాధ్యం కావడం లేదు: కోర్టుకు స్పష్టం చేసిన తీహార్ జైలు అధికారులు

  • ఫోన్ సిగ్నల్స్ నియంత్రణకు జామర్ ఏర్పాటు చేయాలి
  • ఈ విషయమై ఇప్పటికే సీడాట్ కు విజ్ఞప్తి చేశాం 
  • జైలులో అక్రమాలపై విచారణ సందర్భంగా స్పష్టీకరణ

ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా జైలులో రహస్యంగా ఫోన్ వినియోగం నియంత్రణ తమ వల్ల సాధ్యం కావడం లేదని, తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో జైలు లోపల మొబైల్ సిగ్నల్స్ ను నియంత్రించలేకపోతున్నామని ఢిల్లీలోని తీహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు.

ఈ కారణంగానే జైలు ఆవరణలో ప్రోటోటైప్ జామర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సీడాట్ ను కోరినట్లు తెలిపారు. తీహార్ జైలులో మొబైల్స్ సహా ఇతర నిషేధిత వస్తువుల వినియోగం యథేచ్ఛగా సాగుతోందని, ఖైదీలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, ఇంకా ఎన్నో అక్రమాలకు జైలు వేదికగా ఉందని, ఖైదీలను పశువుల కంటే హీనంగా చూస్తున్నారని ఆరోపిస్తూ జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ దోషి 2018లో ఢిల్లీ హైకోర్టుకు లేఖ రాశాడు.

దీనిపై స్పందించిన కోర్టు విచారణకు ఓ న్యాయమూర్తిని నియమించింది. విచారణ జరిపిన సదరు న్యాయమూర్తి గత ఏడాది ఏప్రిల్ లో నివేదిక సమర్పిస్తూ సదరు ఖైదీ చేసిన ఆరోపణల్లో చాలావరకు వాస్తవముందని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వాదనలు నిన్న ఢిల్లీ హైకోర్టులో జరగగా ప్రభుత్వం తరపున రాహుల్ మెహ్రా వాదనలు వినిపించారు.

న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఇప్పటికే బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయడమేకాక శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈసీఐఎల్ జామర్ల ద్వారా సెల్ సిగ్నల్స్ నిరోధానికి ప్రయత్నిస్తున్నామని, కానీ 4జీ సిగ్నల్స్ ను ఈ పరికరాలతో నియంత్రించడం సాధ్యం కావడం లేదని చెప్పారు.

అందుకే ప్రోటోటైప్ జామర్ ఏర్పాటు చేయాలని సీడాట్ ను కోరినట్లు వివరించారు. అలాగే జైలులో ఐదు వేల సీసీ కెమెరాలు, 50 బాడీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జైలులోకి ప్రవేశించే ప్రతివ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు బాడీ స్కానర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.

దీనిపై స్పందించిన న్యాయమూర్తి కేవలం ఖైదీల పర్యవేక్షణకే కాకుండా అధికారుల గదుల్లోనూ ఈ ఏర్పాట్లు చేయాలని ఆదేశించడంతో పాటిస్తామని మెహ్రా తెలిపారు.

More Telugu News