New Delhi: జామియా విశ్వవిద్యాలయం వద్ద కాల్పుల కలకలం.. వారం వ్యవధిలో మూడోసారి!

  • స్కూటీపై వచ్చి కాల్పులు జరిపిన దుండగులు 
  • గేట్ నంబరు 1, 5 వద్ద ఘటన 
  • ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు

జామియా విశ్వవిద్యాలయం వద్ద మరోసారి కాల్పులు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఈ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం వద్ద వారం వ్యవధిలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం మూడోసారి కావడం గమనార్హం. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా విద్యార్థులు వర్సిటీ ముందున్న రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

నిన్న అర్ధరాత్రి తర్వాత స్కూటీపై వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తొలుత ఐదో నంబరు గేటు, తర్వాత ఒకటో నంబరు గేటువద్ద కాల్పులు జరిపి పారిపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. గత గురువారం రాజఘాట్ కు ర్యాలీగా వెళ్తున్న వారిపై కాల్పులు జరిగాయి.

ఆ తర్వాత రెండు రోజులకు మరోసారి ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. తాజాగా మూడో ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్యపట్నాయక్ మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు.  విద్యార్థులు తమ ఆందోళనను విరమించాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News