Kadapa District: విద్యార్థిని చెవి కమ్మలు పోయాయని.. తరగతి గదిలో ఉపాధ్యాయుడి క్షుద్రపూజలు!

  • కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలో ఘటన
  • అంజనం వేయిస్తే దొంగ దొరుకుతాడన్న ఉపాధ్యాయుడు
  • పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు

తరగతి గదిలో ఓ విద్యార్థినికి చెందిన చెవి కమ్మలు పోయాయన్న కారణంతో క్షుద్రపూజలు చేయించాడో ఉపాధ్యాయుడు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని సి.వడ్డెపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆదివారం జరిగిందీ ఘటన. విద్యార్థిని చెవికమ్మలు పోయిన విషయం ఉపాధ్యాయుడు రవికుమార్‌కు తెలిసింది. దీంతో మంత్రగాడిని పిలిపించి అంజనం వేయిస్తే దొంగ దొరుకుతాడని, ఆదివారం తలస్నానం చేసి స్కూలుకు రావాలని ఇద్దరు విద్యార్థులకు చెప్పాడు.

వారు తలారా స్నానం చేసి స్కూలుకు వెళ్లారు. అప్పటికే అక్కడ మంత్రగాడు రమణతో ఉపాధ్యాయుడు రవికుమార్ సిద్ధంగా ఉన్నాడు. విద్యార్థుల చేతి గోళ్లపై పసరు రాసి మంత్రం పఠిస్తున్న సమయంలో ఓ విద్యార్థి తాత స్కూలుకు వెళ్లి జరుగుతున్న తతంగాన్ని చూశాడు. పిల్లలతో ఏం చేయిస్తున్నారని ప్రశ్నించడంతో తత్తరపడ్డారు. విషయం తెలిసిన గ్రామస్థులు స్కూలుకు రావడంతో రమణ పరారయ్యాడు.

గ్రామస్థుల ఫిర్యాదుతో ఉపాధ్యాయుడు వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు ఏదో ఆకు పసరు పూశారని, ఆ తర్వాత తల తిరిగినట్టు అయిందని విద్యార్థులు తెలిపారు. బడిలో క్షుద్రపూజలపై స్పందించిన ఎంఈవో చక్రేనాయక్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ జరిపి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News