GVL Narasimha Rao: కాల్పులు జరిపిన వ్యక్తి పేరు ‘గోపాల్’ కావడంతో.. విపక్షాలు బీజేపీని నిందిస్తున్నాయి: ఎంపీ జీవీఎల్ నరసింహారావు

  • ఆ వ్యక్తి పేరు ఇస్మాయిల్ అయితే అవి మౌనంగా ఉండేవి
  • గోపాల్ తో బీజేపీకి సంబంధం లేదు
  • షహీన్ బాగ్ ఘటనకు వ్యతిరేకంగా మాట్లాడరు

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో నిరసనలు చేస్తున్న విద్యార్థులపై ఓ వ్యక్తి కాల్పులు జరిపిన ఘటనలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై  బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాల్పులు జరిపి అరెస్టైన వ్యక్తి పేరు గోపాల్ కావడంతో దీనివెనక బీజేపీ హస్తం ఉందని విపక్షాలు ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీలను హిపోక్రేట్స్ గా ఆయన అభివర్ణించారు.

‘కాల్పులు జరిపి అరెస్టయిన వ్యక్తి పేరు గోపాల్ కావడంతో వీరు బీజేపీని నిందిస్తున్నారు. అతినితో బీజేపీకి సంబంధం లేదు. ఆ వ్యక్తి పేరు ఇస్మాయిల్ అయివుంటే కనుక, వారు నోరు మెదపకుండేవారు. షహీన్ బాగ్ కు వ్యతిరేకంగా మాట్లాడరు. అదే అది హిందూ జనాభా ఉన్న రామ్ బాగ్ అయితే.. వారు అదేపనిగా దూషణలకు దిగేవారు’ అని వ్యాఖ్యానించారు.

కాగా, నిందితుడు రామ్ భగత్ గోపాల్ శర్మ వయసు 19 సంవత్సరాలనీ, అతను ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని జేవర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి.

More Telugu News