Salman Khan: సల్మాన్ తో సెల్ఫీకి ఓ వ్యక్తి ప్రయత్నం.. కండలవీరుడి ఆగ్రహం!

  • గోవాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
  • ఆ వ్యక్తి చేతిలో నుంచి సెల్ ఫోన్ లాక్కున్న సల్మాన్
  • ఇందుకు సంబంధించిన వీడియో వైరల్

సెలెబ్రిటీలతో సెల్ఫీ దిగిన సంఘటనలు మధురజ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే, అందుకు, ఆ సెలెబ్రిటీ అడ్డుచెప్పకపోతేనే. ఒకవేళ అడ్డుచెబితే పరిస్థితి ఇలాగే ఉంటుందనడానికి నిదర్శనం తాజాగా జరిగిన ఈ సంఘటనే. బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ మరోమారు వార్తల్లోకి ఎక్కారు. తనతో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించిన ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సల్మాన్, అతని చేతిలో నుంచి సెల్ ఫోన్ ను లాగేసుకున్నాడు. గోవాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది.

కాగా, సల్మాన్ తో సెల్ఫీకి యత్నించిన వ్యక్తి ఎవరన్న విషయమై విమానాశ్రయ అధికారులు స్పష్టత నిచ్చారు. వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా ఈ ఘటనపై ఆరా తీసినట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు. సల్మాన్ తో సెల్ఫీ దిగేందుకు యత్నించిన వ్యక్తి విమానయాన సంస్థకు చెందిన గ్రౌండ్ స్టాఫ్ అని చెప్పారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు.

More Telugu News