Nirbhaya: ఆత్మహత్యలు చేసుకోకుండా నిర్భయ దోషులకు కట్టుదిట్టమైన భద్రత

  • 6x8 వైశాల్యం కలిగిన వేర్వేరు గదుల్లో నిర్భయ దోషులు
  • ప్రతి గదిలో రెండు సీసీ కెమెరాలు
  • ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరితీత

18వేల మంది ఖైదీలు ఉన్న తీహార్ జైల్లో అందరికంటే ఎక్కువ భద్రతను నిర్భయ దోషులకు కల్పిస్తున్నారు. గ్యాంగ్ స్టర్లు, డాన్లు, పేరు మోసిన క్రిమినల్స్ కంటే వీరికే అత్యధిక భద్రత ఉంది. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు వీరికి ఉరిశిక్షను అమలు చేయనున్న నేపథ్యంలో, వీరికి ఎన్నడూ లేని విధంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా నిరంతరం కాపలాగా ఉంటూ, గట్టి నిఘా ఉంచారు.

జనవరి 16న నిర్భయ దోషులను తీహార్ జైల్లోని మూడో నంబరు కారాగారానికి తరలించారు. అక్కడున్న 6x8 వైశాల్యం కలిగిన వేర్వేరు గదుల్లో వీరిని ఉంచారు. ఈ గదుల్లో ఎలాంటి రెయిలింగులు, రాడ్లు ఉండవు. ప్రతి గది వద్ద ఇద్దరు గార్డులు 24 గంటలూ కాపలాగా ఉంటున్నారు. గదులకు అటాచ్డ్ టాయిలెట్లు కూడా ఉన్నాయి. అక్కడ కూడా వీరిపై నిఘా ఉంచేలా ఏర్పాట్లు ఉన్నాయి. వారి గదులను రోజుకు రెండు సార్లు గార్డులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నిషేధిత వస్తువులు ఉన్నాయా? అని చెక్ చేస్తున్నారు. ప్రతి గదిలో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీరిని జైలు సూపరింటెండెంట్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

దోషులు తమను తాము గాయపరుచుకోకుండా గదుల్లో మేకులు, ఇతర వస్తువులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గోడకు తలను బాదుకునే అవకాశం మాత్రమే ప్రస్తుతం వీరికి ఉంది. ఉరితీత అమలును వాయిదా వేయడానికి కొందరు దోషులు ఇలాంటి యత్నాలకు పాల్పడుతుంటారు. 2013 మార్చి 11న ఈ కేసులో మరో నిందితుడైన రామ్ సింగ్ జైలు గదిలో ఆత్మహత్యకు పాల్పడటం అప్పట్లో సంచలనాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే.

మరోవైపు, నిర్భయ దోషులకు వైద్యులు ప్రతిరోజు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దోషుల్లో పవన్ గుప్తా మినహా మిగిలిన ముగ్గురు ఎలాంటి ఆందోళన చెందుతున్నట్టు కనిపించడం లేదని జైలు అధికారి ఒకరు తెలిపారు. పవన్ కొన్నిసార్లు ఆహారాన్ని కూడా తీసుకోవడం లేదని చెప్పారు.

More Telugu News