Nirbhaya: ఉరి తేదీని మార్చండి... ఢిల్లీ కోర్టును కోరిన తీహార్ జైలు అధికారులు

  • ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించి లెఫ్టినెంట్ గవర్నర్
  • తోసిపుచ్చాలంటూ కేంద్రానికి సిఫారసు
  • రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో పిటిషన్
  • ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపిన తీహార్ జైలు అధికారులు

నిర్భయ దోషుల ఉరితీత అమలులో జాప్యం తప్పదని తెలుస్తోంది. ఈ నెల 22న నలుగురు దోషులను ఉరి తీయాలని ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు ఇప్పటికే డెత్ వారెంట్ జారీ చేసింది. దాంతో దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి వ్యతిరేకత ఎదురైంది. ఆపై దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ రాష్ట్రపతిని, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను వేర్వేరు పిటిషన్ల ద్వారా క్షమాభిక్ష కోరాడు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆ పిటిషన్ ను తిరస్కరించారు. అంతేకాదు, ఆ పిటిషన్ ను తోసిపుచ్చాలంటూ కేంద్ర హోంశాఖకు కూడా సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో తాము సకాలంలో ఉరి శిక్ష అమలు చేయలేమంటూ తీహార్ జైలు అధికారులు ఢిల్లీ కోర్టుకు విన్నవించుకున్నారు. ఉరితీత తేదీని మార్చాలని విజ్ఞప్తి చేశారు.

దోషి ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద ఉందని, జైలు నిబంధనల ప్రకారం మరణశిక్ష అమలుచేయలేని పరిస్థితి ఏర్పడిందని, ఉరితీత అమలు తేదీని మార్చాలని కోర్టును కోరారు. క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున ఉరితీత జాప్యమయ్యే అవకాశాల గురించి తీహార్ జైలు అధికారులు అటు ఢిల్లీ ప్రభుత్వానికి కూడా ఓ లేఖ రాశారు.

More Telugu News