India: రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం

  • ఈ నెల 20 నుంచి 30 వరకు ఎయిర్ పోర్టుల్లో ఆంక్షలు
  • సందర్శకులకు అనుమతి నిరాకరణ
  • ప్రయాణికులు ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచన
  • ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలపైనా ఆంక్షలు

జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20 నుంచి 30 వరకు విమానాశ్రయాల్లో సందర్శకులను అనుమతించరాదని నిర్ణయించింది. ప్రయాణికులు విమానాశ్రయానికి ముందుగానే చేరుకోవాలని సూచించింది.

రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో ఆంక్షలు విధించారు. ఈ నెల 18, 20, 21, 22, 23, 24, 26 తేదీల్లో విమానాల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. కాగా, భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా విమానాశ్రయాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే భద్రతా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News