Nirbhaya: నిర్భయ దోషులకు లాస్ట్ చాన్స్... 14న క్యూరేటివ్ పిటిషన్ పై విచారణ!

  • జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో విచారణ
  • విచారించనున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనం
  • ఉరి ఖాయమైతే 22న అమలు

నిర్భయ కేసులో దోషులకు మరణదండన విధించాలా? వద్దా? అనే విషయమై చిట్టచివరి విచారణ, 14వ తేదీన జరుగనుంది. ఈ కేసులో ఉరిశిక్షను ఎదుర్కోనున్న నలుగురిలో, ఇద్దరు నిందితులు వినయ్ శర్మ, ముఖేష్ కుమార్ లు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ దోషులకు 8వ తేదీన డెత్ వారంట్ జారీ అయిన సంగతి తెలిసిందే.

కాగా, తన తల్లిదండ్రులు వృద్ధులని, పేదలని, ఈ కేసు కారణంగా సామాజిక హేళనకు గురయ్యారని వినయ్ శర్మ తన క్యూరేటివ్ పిటిషన్ లో పేర్కొన్నాడు. తనను ఉరితీస్తే కుటుంబం ధ్వంసమైపోతుందని వాపోయాడు. ఈ కేసు కారణంగా ఆర్థికంగా చితికిపోయానని పేర్కొన్నాడు. వినయ్ తరఫున సీనియర్ న్యాయవాధి అధీస్ సీ అగర్ వాలా ఈ పిటిషన్ దాఖలు చేశారు. తన క్లయింటు జైలు జీవితం, అతని మానసిక పరిస్థితులను పరిశీలించి, ఉరిశిక్షను తప్పించాలని ఆయన కోరారు. ఇక ఈ పిటిషన్ లకు వ్యతిరేకంగా తీర్పు వస్తే, 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరిశిక్షను అమలు చేస్తారు.

More Telugu News