KCR: కేసీఆర్ సంక్రాంతి కొత్త ఇంట్లోనే... రాత్రీ, పగలు లేకుండా పనులు!

  • ఫామ్ హౌస్ నైరుతి భాగంలో నూతన గృహం
  • ఇప్పటికే శాస్త్రోక్తంగా పూర్తయిన గృహ ప్రవేశం
  • మిగిలిన పనులను శరవేగంగా చేస్తున్న కార్మికులు

తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ పరిధిలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నిర్మిస్తున్న నూతన గృహంలోనే సంక్రాంతి పండగను జరుపుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకోవడంతో, ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రేయింబవళ్లూ పనులు జరుగుతున్నాయి.

సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలో కేసీఆర్ పదేళ్ల క్రితమే భూమిని కొని, రెండంతస్తుల భవంతిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకన్నా అత్యాధునిక సౌకర్యాలతో ఆ స్థలంలో నైరుతి మూల కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. పాత ఇంటికి లిఫ్ట్ సౌకర్యం లేకపోగా, కొత్త ఇంటిలో ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు.

గత సంవత్సరం డిసెంబర్ 13 నుంచి గురు మూఢమి ప్రారంభమవుతుందన్న కోణంలో, అంతకు ముందే కేసీఆర్‌ శాస్త్రోక్తంగా వాస్తు పూజలు నిర్వహించి, గృహ ప్రవేశాన్ని లాంఛనంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటికి ఇంటి నిర్మాణం పూర్తి కాలేదు. ముఖ్యమైన పనులు మిగిలిపోయాయి. ఆపై తనకు వీలు చిక్కినప్పుడల్లా కేసీఆర్ ఎర్రవెల్లి వెళ్లి పనులను సమీక్షిస్తూ వచ్చారు.

ఈ నెల 10తో గురు మూఢమి వెళ్లిపోనుండగా, 11వ తేదీలోగా పనులు పూర్తి కావాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండగను తాను సొంత ఇంట్లోనే జరుపుకుంటానని ఆయన స్పష్టం చేయడంతో దాదాపు 200 మందికిపైగా కార్మికులు ఇంటి నిర్మాణానికి తుది మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

More Telugu News