Jr NTR: అభిమానులకు జాగ్రత్తలు చెప్పి పంపించిన జూనియర్ ఎన్టీఆర్

  • హైదరాబాదులో 'ఎంత మంచివాడవురా' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్
  • ప్రాణాలు ఎంతో ముఖ్యమంటూ హితవు

కల్యాణ్ రామ్, మెహ్రీన్ జంటగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎంత మంచివాడవురా' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, ముందుగా అభిమానులను నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటేనే మాట్లాడతానని, లేకపోతే వెళ్లిపోతానని స్పష్టం చేశారు. దాంతో అభిమానుల కోలాహలం కొద్దిమేర తగ్గింది. ఆపై తన ప్రసంగం కొనసాగించారు.

"మా కల్యాణ్ అన్న ఎన్నో రకాల పాత్రలు పోషించాడు. థ్రిల్లర్ సినిమాలు కూడా చేశాడు. కానీ మా అన్నను ఒక్కసారి కుటుంబ కథా చిత్రంలో చూడాలని అనుకున్నాను. ఇప్పుడు దర్శకుడు సతీశ్ వేగేశ్న ద్వారా ఆ కోరిక తీరింది. మా కుటుంబంలో ఒకరిగా భావించే శివలెంక కృష్ణప్రసాద్ నేతృత్వంలో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం తప్పకుండా హిట్టవుతుందని ఆశిస్తున్నాను. గోపీసుందర్ సంగీతం అందించిన 'ఎంత మంచివాడవురా' జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మంచి మనసుతో, గొప్ప హృదయంతో ఈ చిత్రయూనిట్ ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.

ఇప్పుడు మీకో విజ్ఞప్తి. మీరందరూ ఆనంద కోలాహలంతో ఉన్నారు. ఇదే ఆనందాన్ని మీ ఇంటివరకు వెళ్లి పంచుకోండి. ఇక్కడున్న మీ అందరి ప్రాణాలు మీ తల్లిదండ్రులకు, మీ అన్నచెల్లెళ్లకు, మీ కుటుంబసభ్యులకు ఎంతో ముఖ్యం. మాకు కూడా మీరు ఎంతో ముఖ్యం. అందరూ ఎల్లప్పుడూ ఇలాగే సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు, రాబోయే సంక్రాంతికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఇక ఈ సంక్రాంతికి రాబోతున్న దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల... వైకుంఠపురములో, మా చిత్రం ఎంత మంచివాడవురా చిత్రాలను అన్నింటిని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. తద్వారా తెలుగు చిత్రపరిశ్రమ ముందుకెళ్లేలా తోడ్పాటునందిస్తారని ఆశిస్తున్నాను. జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ" అంటూ ప్రసంగం ముగించారు.

More Telugu News