social volunteers: తల్లి జైలు నుంచి విడుదల... అమ్మ ఒడి చేరిన ఏడాది పాప!

  • ఉద్యమకారిణి ఏక్తా శేఖర్ దంపతులు విడుదల
  • పౌరసత్వ చట్టంపై ఆందోళన
  • వారణాసిలో అరెస్టు చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు

అమ్మే సర్వస్వం అయ్యే సమయంలో ఆమె జైలుకు వెళితే ఏడాది బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ తల్లి మనసు ఎంత విలవిల్లాడుతుంది...నిన్న సామాజిక ఉద్యమకారిణి ఏక్తా శేఖర్ జైలు నుంచి విడుదల సందర్భంగా ఇటువంటి దృశ్యమే జైలు గేటువద్ద కనిపించింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏక్తా, ఆమె భర్త రవి శేఖర్లు ఆందోళనకు దిగారు. వారణాసిలో 'క్లైమేట్ ఎజెండా' పేరుతో వీరు ఓ ఎన్జీఓను నడుపుతున్నారు. అదే సమయంలో సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.

సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో కూడా వీరు పాల్గొన్నారు. డిసెంబరు 19వ తేదీన వారణాసిలో ఆందోళన చేపడుతున్న సందర్భంగా అక్కడి పోలీసులు మొత్తం 60 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. వీరిలో ఏక్తా, రవి శేఖర్ కూడా ఉన్నారు. తల్లి అరెస్టుతో ఆ ప్రభావం ఆమె ఏడాది కుమార్తె చంపక్ పై పడింది.

తల్లిపాలు అందలేదు. బంధువులు ఇంటికి వెళ్లి బిడ్డ సంరక్షణ బాధ్యతలు తీసుకున్నా తల్లిపై బెంగతో ఆమె ఆహారం తీసుకోలేదని చెబుతున్నారు. బెయిలు మంజూరు కావడంతో జైలు నుంచి విడుదలైన వెంటనే బిడ్డను చూసి ఏక్తాశేఖర్ కాసేపు ఉద్వేగానికి లోనయ్యారు.

'జైలు జీవితం నాకు పరీక్షా సమయంలా అనిపించింది. ఎందుకంటే నా బిడ్డకు తల్లి పాలు దూరమయ్యాయి. దీంతో నేను తీవ్ర ఆందోళనకు లోనయ్యాను' అంటూ బిడ్డను చేతుల్లోకి తీసుకుని ఏక్తా మురిసిపోయారు.

More Telugu News