Uttarakhand: కుక్క పిల్లను కన్నబిడ్డలా చూసుకున్న కోతి.. వీడియో వైరల్

  • ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఘటన
  • గుర్తించిన ఓ మహిళ
  • కుక్క పిల్లను ఎత్తుకొని తిప్పుతున్న కోతి

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్, గాయత్రి విహార్ కాలనీలో ఓ కోతి.. కుక్కపిల్ల బాగోగులను చూసుకుంటూ అందరి దృష్టినీ ఆకర్షించింది. జాతి వైరం మరచి ఆ ఆడకోతి కుక్క పిల్లకు సేవలు చేయడాన్ని అను బిష్త్ అనే ఓ మహిళ గుర్తించి ఇందుకు సంబంధించిన ఫొటోలు తీసింది. కుక్క పిల్లకు ఆ కోతి ఆహారం అందించి, తల్లిలా అన్ని సేవలు చేస్తోంది.

అయితే, ఆ కుక్క పిల్లను ఆ కోతి ఎత్తుకొని తిప్పుతుండడంతో దానికి ప్రమాదం జరగొచ్చని భావించి, అటవీ శాఖ అధికారులకు ఆమె సమాచారం అందించింది. దీంతో అక్కడకు చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఆ కోతితో పాటు కుక్కపిల్లను పట్టుకున్నారు.

ఆ కుక్క పిల్లను తాను పెంచుకుంటానని అను బిష్త్ చెప్పడంతో దాన్ని ఆమెకు ఇచ్చేశారు. అనంతరం కోతిని కూడా వదిలేశారు. ఆ కుక్కపిల్లను కోతి బాగానే చూసుకుంటున్నప్పటికీ, దానివల్ల ఆ కుక్కపిల్లకు ఎప్పటికైనా ప్రమాదం జరగొచ్చని అటవీ శాఖ అధికారులు భావించారు. కాగా, కుక్కను ఆ కోతి కన్నబిడ్డలా చూసుకుంటుండగా తీసిన వీడియో బయటకు వచ్చింది.

More Telugu News