Pawan Kalyan: ఆ ఆడబిడ్డను చంపినవాళ్ల కేసును జగన్ ఎందుకు బయటికి తీయడంలేదు... వాళ్లకు లేరా బిడ్డలు?: పవన్ ఆగ్రహం

  • సీమలో పవన్ పర్యటన ప్రారంభం
  • రైల్వేకోడూరులో సభ
  • ఆగ్రహంతో ప్రసంగించిన పవన్

రైల్వేకోడూరు సభలో జనసేనాన పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగేలా ప్రసంగించారు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో కర్నూలు జిల్లాలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ కళాశాలలో ఓ అమ్మాయి మరణించిందని, ఆమెపై అఘాయిత్యం జరిగిందని ఆమె తల్లి చెబితే కళ్లవెంబడి నీళ్లు వచ్చాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆడబిడ్డను చంపిన వాళ్ల కేసును జగన్ రెడ్డి ఎందుకు బయటికి తీయడంలేదని ప్రశ్నించారు. వాళ్లను ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని నిలదీశారు.

"పోలీసులు ఏంచేస్తున్నారక్కడ... వాళ్లకు లేరా ఆడబిడ్డలు, రాజకీయ నాయకులకు లేరా ఆడబిడ్డలు.. ఆ ఆడబిడ్డను చంపేసిన వెధవలకు లేరా ఆడబిడ్డలు... అడిగేవాళ్లు లేరా?" అంటూ తీవ్రస్వరంగా ప్రసంగించారు. తన బిడ్డ చనిపోతే న్యాయం కోసం ఓ సామాన్యురాలు స్వయంగా న్యాయవాదిగా మారిందని, తమ కేసును తానే వాదించుకుందని తెలిపారు. తన బిడ్డలా మరెవరూ కాకూడదని, ఇంకా అనేక మంది జీవితాలు నాశనం అవుతున్నాయని, వారందరి తరఫున మాట్లాడమని తనకు చెప్పిందని వివరించారు. చట్టాలు బలంగా ఉండాల్సిన అవశ్యకతను ఇలాంటి ఘటనలు ఎత్తిచూపుతున్నాయని పవన్ పేర్కొన్నారు.

అంతేకాకుండా, జిల్లాలో బత్తాయి తోట నరికివేతను ప్రస్తావిస్తూ, పచ్చనిచెట్లను నరికేవాళ్లు, పద్నాలుగేళ్ల ఆడబిడ్డపై అత్యాచారం చేసినవాళ్లకు ఆ ఉసురు ఊరికేపోదని హెచ్చరించారు. నాశనం అయిపోతారని, రోజులు లెక్కబెట్టుకోండని తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు.

More Telugu News