Chandrababu: మీ ముఖాలకు వేసుకోండి రంగులు... ప్రజలు వెంటనే జాగ్రత్తపడతారు: కడపలో చంద్రబాబు వ్యాఖ్యలు

  • కడప జిల్లాలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
  • హాజరైన చంద్రబాబు
  • వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు

రాష్ట్రంలో చిత్రవిచిత్రమైన పాలన నెలకొందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జగన్ సర్కారును ఎద్దేవా చేశారు. మద్యం పాలసీలో తనకు కమిషన్లు రావని కొన్ని బ్రాండ్లకే అనుమతి ఇచ్చాడంటూ సీఎం జగన్ పై ఆరోపణలు చేశారు. రోజంతా మద్యం అమ్మకాలు సాగితే తమవాళ్లకు వ్యాపారాలు ఉండవు కాబట్టి, సాయంత్రం ఏడు, ఎనిమిది గంటలకల్లా షాపులు మూయించి, ఇళ్ల వద్ద బెల్టు షాపులు తెరిపిస్తాడని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం నిర్ణయంతో మద్యం తాగడం ఏమైనా ఆగిందా తమ్ముళ్లూ? అంటూ చంద్రబాబు కార్యకర్తలను అడిగారు. ఆఖరికి దొంగసారా కూడా వస్తోందని అన్నారు. పక్క రాష్ట్రాల నుంచి ట్యాక్సులు కట్టకుండా నాన్ పెయిడ్ లిక్కర్ కూడా వచ్చేస్తోందని తెలిపారు.

"ఎంత తెలివైన వాడనుకోవాలి? మొన్నటికి మొన్న బార్లను కూడా రద్దు చేశాడు. ఇంకా ఆర్నెల్లు సమయం ఉండగానే వాటిని రద్దు చేశాడు. తన మనుషులకు బార్లు ఇచ్చుకోవాలన్నదే ఆయన ఉద్దేశం. ఇవన్నీ చిత్రవిచిత్రాలు. ఏంచెప్పాలో అర్థం కావడంలేదు" అంటూ వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, వీళ్ల పిచ్చి పరాకాష్టకు చేరిందని, జాతీయ జెండాలకు కూడా వైసీపీ రంగులేసుకుంటున్నారని విమర్శించారు. గాంధీ విగ్రహాలే కాకుండా చివరికి దేవాలయాలకు, దేవుళ్లకు కూడా రంగులేస్తున్నారు అంటూ మండిపడ్డారు. "నేను చెబుతున్నాను... మీ ముఖాలకు వేసుకోండి రంగులు. మీ ఇళ్లకు కూడా వేసుకోండి. ప్రజలు మిమ్మల్ని చూసి జాగ్రత్తపడతారు. వైసీపీ దారిదోపిడీ దొంగలు ఉన్నారని మీ ముఖాన ఉన్న రంగులు చూసి అప్రమత్తమవుతారు" అంటూ ఎద్దేవా చేశారు.

More Telugu News