Sharad Pawar: ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చి.. మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన అజిత్ పవార్ ఎవరు? ఆయన ప్రస్థానం ఏమిటి?

  • శరద్ పవార్ అన్నయ్య కుమారుడే అజిత్ పవార్
  • 1982లో రాజకీయరంగ ప్రవేశం
  • శరద్ పవార్ కోసం ఎంపీ స్థానాన్ని త్యాగం చేసిన అజిత్ పవార్

అజిత్ పవార్... ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లకు షాకిస్తూ... బీజేపీని అధికారంపీఠంపై కూర్చోబెట్టిన నేత అజిత్ పవార్. ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చి, బీజేపీకి మద్దతు ప్రకటించి మహారాష్ట్ర రాజకీయాలకు ఊహకందని ట్విస్ట్ ఇచ్చిన నాయకుడు. ఈ ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయగా... డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. గంటల వ్యవధిలో మహారాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన అజిత్ పవార్ ఎవరో తెలుసుకుందాం.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సొంత అన్నయ్య కుమారుడే అజిత్ పవార్. గోవిందరావ్ పవార్ దంపతులకు 11 మంది సంతానం. వారిలో శరద్ పవార్ ఒకరు. శరద్ పవార్ అన్నయ్య అనంతరావ్ పవార్ కుమారుడే అజిత్ పవార్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ స్టూడియోస్'లో అనంతరావ్ పవార్ పని చేసేవారు. 1959లో జన్మించిన అజిత్ పవార్ కు విద్యా పరంగా ఎస్ఎస్సీ (మహారాష్ట్ర బోర్డు) సర్టిఫికెట్ ఉంది. ఆ తర్వాత చదువును కొనసాగిస్తున్న సమయంలో ఆయన తండ్రి హఠాన్మరణం చెందారు. దీంతో, విద్యాభ్యాసాన్ని వదిలేసి, తన కుటుంబ బాధ్యతలను స్వీకరించారు.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో శరద్ పవార్ ఓ బలమైన నేతగా ఎదిగారు. మరోవైపు, తన చదువును కొనసాగించడానికి పూణె జిల్లా నుంచి అజిత్ పవార్ ముంబైకి మకాం మార్చారు. 1982లో అజిత్ పవార్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991లో పూణె జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ గా ఎన్నికై... అదే పదవిలో ఏకంగా 16 సంవత్సరాలు కొనసాగారు. ఇదే సమయంలో బారామతి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత తన చిన్నాన్న శరద్ పవార్ కోసం బారామతి స్థానాన్ని త్యాగం చేశారు. అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందిన శరద్ పవార్ పీవీ నరసింహారావు కేబినెట్ లో రక్షణ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.

ఆ తర్వాత బారామతి ఎమ్మెల్యేగా అజిత్ పవార్ గెలుపొందారు. ఇదే స్థానం నుంచి వరుసగా 1995, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాల్లో పలు శాఖలకు మంత్రిగా పని చేశారు. మహారాష్ట్ర మాజీ మంత్రి పదంసిన్హ్ పాటిల్ కుమార్తె సునేత్రను అజిత్ పవార్ పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు.

తాజాగా, అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చడం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీనిపై శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఎన్సీపీనే కాదు... మా కుటుంబం కూడా చీలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News