columinst Sunanda vashist: మా శీలాన్ని కాపాడడానికి మా తాత మమ్మల్ని చంపాలనుకున్నారు: ప్రముఖ కశ్మీరీ కాలమిస్ట్ సునంద

  •  యూఎస్ కాంగ్రెషనల్ సదస్సులో భారత్ తరపున హాజరైన సునంద
  • కశ్మీర్లో మానవ హక్కులు కాలరాచారనడానికి మా కుటంబమే నిదర్శనం
  • కశ్మీర్ మమ్మాటికి భారత్ దే నని  దేశ ప్రజల గళాన్ని వినిపించిన సునంద

కశ్మీర్ ముమ్మాటికి తమదేనని వాషింగ్టన్ వేదికగా భారత్ స్పష్టం చేసింది. భారత్ లో కశ్మీర్ అంతర్భాగమని పేర్కొంది. మానవ హక్కులపై యూఎస్ కాంగ్రెషనల్ (సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యులతో కూడిన) కమిటీ జరిపిన సమావేశంలో భారత్ తరపున ప్రముఖ కాలమిస్ట్, కశ్మీరీ పండిట్ సునంద వశిష్ఠ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కశ్మీర్లో తమ కుటుంబానికి ఎదురైన అనుభవాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు.

 ‘మా దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికి దాన్ని కాపాడుకుంటున్నాము. ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్ ను బలపర్చాల్సి ఉంటుంది. పాక్ ప్రభుత్వం రెండు నాల్కల ధోరణిని విడనాడాలి. మానవ హక్కుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన సమయమిదేనని’ ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కశ్మీర్లో తమ కుటుంబం పడ్డ కష్టాలను ఆమె సభ్యులకు వివరించారు.

‘నేను కశ్మీరీ హిందూ కుటుంబానికి చెందిన మహిళను. 30 ఏళ్ల క్రితం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్లో చేపట్టిన అరాచకాలకు అంతే లేకుండా పోయింది. అక్కడ ఆర్త నాదాలకు ఆ ఉగ్ర మూకలే కారణం.  ఆ దాడుల్లో స్థానిక హిందూ కుటుంబాలు చాలా నష్టపోయాయి.  మహిళలకు రక్షణే లేకపోయింది. అక్కడ మానవత్వం మంట గలిసింది. అక్కడి మసీదుల్లో, హిందూ పురుషులు వద్దంటూ.. హిందూ మహిళలతో కూడిన కశ్మీర్ కావాలని వేలకొద్దీ గొంతులు గళమెత్తాయి. ఆ మూకలు మా మీదకు వస్తే కనుక, నన్ను, మా అమ్మను చంపి, మా శీలాన్ని కాపాడడానికి మా తాత కత్తి పట్టాడు. అదృష్టవశాత్తు బతికిపోయాం. ఈవేళ మానవ హక్కుల కోసం గగ్గోలు పెడుతున్న ఈ లాయర్లు ఆ రాత్రి ఏమయ్యారు మరి?’ అంటూ ఆమె ఆవేశంగా ప్రశ్నించారు.  

అక్కడి హిందూ ప్రజలకు ఉగ్రవాదులు మూడు అవకాశాలిచ్చారు. 'పారిపోండి లేదా మతం మారండి లేదా మీ కర్మకు మీరు చావండి' అని అన్నారని ఆమె తెలిపారు. సుమారు 4 లక్షల మంది కశ్మీరీ హిందువులు 1990 జనవరి 19 నాటి భయంకర రాత్రి తర్వాత అక్కడినుంచి వేరేప్రాంతాలకు వెళ్లిపోయి బతికిపోయారు. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అక్కడి మా ఇంటికి వస్తామని మేము చెబుతున్నా.. మమ్మల్ని స్వాగతించే వారు లేరు కదా, మమ్మల్ని అనుమతించలేదు. మా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకోని ఇళ్లను తగుల బెట్టారు అని పేర్కొన్నారు.

టెక్సాస్ నుంచి కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షీలా జాక్సన్ లీ, కశ్మీర్లో మానవ హక్కుల పరిరక్షణకోసం ఒక మార్గం కనుక్కోవడానికి ప్రయత్నిస్తామని అన్నారు. ఇందుకు భారత్ లోని  జమ్మూ కశ్మీర్, పీవోకేలో పర్యటించడానికి యూఎస్ కాంగ్రెస్ సభ్యులను ఎందుకు అనుమతివ్వరో చూద్దామని వ్యాఖ్యానించారు.

More Telugu News