siddaramaiah: ఓట్లయితే వేయించుకున్నారు.. మరి మా ఇళ్లేవీ?: సిద్ధరామయ్య కారును కదలకుండా అడ్డుకున్న మహిళలు

  • బాదామి ప్రాంతంలో పర్యటించిన సిద్ధరామయ్య
  • ఆయన కారుకు అడ్డంపడి అడ్డుకున్న మహిళలు
  • ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మహిళల నుంచి చేదు అనుభవం ఎదురైంది. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న బాదామి ప్రాంతంలో సిద్ధరామయ్య నిన్న పర్యటించి వస్తుండగా కొందరు మహిళలు ఆయన కారుకు అడ్డుపడ్డారు. ఓట్లేస్తే ఇళ్లిస్తామని చెప్పడంతో ఓట్లేశామని, మరి మా ఇళ్లు ఎక్కడంటూ ప్రశ్నలతో ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇళ్లు వస్తాయన్న ఆశతో ఓట్లేస్తే ఇప్పటి వరకు ఇళ్ల మంజూరు అతీగతీ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరదలు రావడంతో ఇప్పుడు ఇళ్లు లేక రోడ్డున పడ్డామని, తమకు దిక్కెవరని ప్రశ్నించారు. మీ ఓట్లు మీకొచ్చాయి కానీ తమకే ఇళ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇప్పుడు ఇళ్లెవరు ఇస్తారని ప్రశ్నిస్తూ ఆయన కారును కదలకుండా అడ్డుకున్నారు. దీంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వారు నచ్చజెప్పి మహిళలను దూరంగా పంపడంతో సిద్ధరామయ్య కారు ముందుకు కదిలింది.

More Telugu News