amalapuram: మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అరెస్ట్ చేసేందుకు నాలుగు బృందాలు: ఏలూరు రేంజ్‌ డీఐజీ ఖాన్‌

  • ఏ క్షణమైనా ఆయనను అరెస్టు చేస్తాం
  • విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించారు
  • న్యాయమూర్తులను పరుష పదజాలంతో దూషించారు

చట్టవ్యతిరేకంగా వ్యవహరించి తప్పించుకు తిరుగుతున్న అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అరెస్ట్ చేసేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని, ఏ క్షణమైనా ఆయనని అరెస్టు చేస్తామని ఏలూరు రేంజ్‌ డీఐజీ ఎ.ఎస్‌.ఖాన్‌ తెలిపారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, న్యాయమూర్తులను పరుష పదజాలంతో దూషించడం, మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం వంటి పలు కేసులు ఆయనపై ఉన్నాయని చెప్పారు.

ఇటీవల రాజమహేంద్రవరం కోర్టు స్థలంలో ఆక్రమణలు తొలగిస్తుండగా హర్షకుమార్‌ ఘటనా స్థలికి వచ్చి జిల్లా న్యాయమూర్తిని పరుష పదజాలంతో దూషించారని, అక్కడ ఉన్న కోర్టు ఉద్యోగులను బెదిరించారని తెలిపారు. అక్కడి మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్నారు. దీనిపై జిల్లా కోర్టు పరిపాలనాధికారి మూడో పట్టణ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఐజీ వివరించారు.

అలాగే, ఇటీవల గోదావరిలో బోటు మునిగిపోయిన ఘటనలో బోటులో 93 మంది ప్రయాణికులు ఉన్నారంటూ ప్రజల్ని, వ్యవస్థను తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన వద్ద ఉన్న సమాచారం ఇస్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నోటీసులు ఇచ్చినా స్పందించలేదన్నారు. అంటే తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశారన్నారు.

ఈ కేసులపై హర్షకుమార్‌ను అరెస్టు చేసేందుకు వెళితే పరారయ్యారని, దీంతో ఆయన్ను పట్టుకునేందుకు నాలుగు బృందాలతో గాలిస్తున్నామని తెలిపారు. ధిక్కార ధోరణిలో మాట్లాడి ప్రజలను తప్పుదోవపట్టించే వారు ఎంతటి వారైనా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని డీఐజీ ఖాన్‌ స్పష్టం చేశారు.

More Telugu News