Palasa: వైసీపీ ఎమ్మెల్యేకు తెల్ల రేషన్ కార్డు... స్వయంగా చెప్పుకుని విమర్శల పాలు!

  • తెల్ల రేషన్ కార్డుల దుర్వినియోగం
  • పలాస ఎమ్మెల్యే అప్పలరాజుకు రేషన్ ఇచ్చిన వలంటీర్
  • ఫోటోలు బయటకు రావడంతో విషయం వెలుగులోకి

పేదలకు అందాల్సిన తెల్ల రేషన్ కార్డులు ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయో తెలిపేందుకు ఇది మరో ఉదాహరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు కుటుంబానికి తెల్ల రేషన్ కార్డుంది. ఈ విషయం ఇంతవరకూ బయటకు రాలేదుగానీ, కొత్తగా వచ్చిన గ్రామ వలంటీర్ వ్యవస్థ ఈ విషయాన్ని బయట పెట్టింది. ఆయన కుటుంబానికి బియ్యం, తదితర వస్తువులతో కూడిన రేషన్ ఇచ్చేందుకు సంబంధిత వలంటీర్ వెళ్లగా, ఫోటోలు దిగి, వాటిని అప్పలరాజు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చి వైరల్ అయింది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి తెల్ల రేషన్ కార్డు ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

ఇక తనపై వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చిన అప్పలరాజు, ఆధార్ కార్డులు రావడానికి ముందు తాను పింక్ కార్డు కోసం దరఖాస్తు చేశానని, ఆపై కొన్నాళ్లకు తనకు కార్డు వచ్చిందని, అది తెల్లకార్డని కూడా తనకు తెలియదని అన్నారు. తనకు కార్డు వచ్చిన తరువాత రెండు ప్రభుత్వాలు మారిపోయాయని, తన కార్డును క్యాన్సిల్ చేయాలని పలాస ఎమ్మార్వోకు చెప్పానని అన్నారు.

ఇదిలావుండగా, ఆయన వివరణపై నెటిజన్లు ఏ మాత్రం సంతృప్తిగా లేరు. ఎమ్మెల్యేకు తెల్ల రేషన్ కార్డు ఏంటంటూ కామెంట్లు వస్తున్నాయి. ఆయన గ్యాస్ సిలిండర్ ను కూడా పరిశీలించాలని, అది కూడా సబ్సిడీపైనే ఉండి వుంటుందని అంటున్నారు. ఎమ్మెల్యే స్థాయిలోని వ్యక్తికి తెల్ల రేషన్ కార్డుంటే, నెలకు 50 వేల వేతనం తీసుకునే ఉద్యోగికి కూడా తెల్ల కార్డే ఉండాలని, ఆ మేరకు నిబంధనలను సవరించాల్సిందేనని కూడా పలువురు అంటున్నారు.

More Telugu News