Siddaramaiah: సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చింది సిద్ధరామయ్యే.. మా కుటుంబంపై కుతంత్రాలకు పాల్పడ్డారు: దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు

  • సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచిన ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది సిద్ధరామయ్య వర్గీయులే
  • అంతా చేసి.. ఏమీ తెలియనట్టు నాటకాలాడుతున్నారు
  • ఆయన మనసులో ఇంత విషం ఉందనే విషయాన్ని గ్రహించలేకపోయాం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యపై మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చింది సిద్ధరామయ్యేనని ఆయన వ్యాఖ్యానించారు. తన ఆరోపణలకు పక్కా ఆధారాలు ఉన్నాయని... వాటిని సరైన సమయంలో బయటపెడతానని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి, అనర్హత వేటును ఎదుర్కొన్న ఎమ్మెల్యేలలో అత్యధికులు సిద్ధరామయ్య వర్గీయులేనని మండిపడ్డారు. చేసిందంతా చేసి, ఏమీ తెలియనట్టు నాటకాలాడుతున్నారని విమర్శించారు. చాముండేశ్వరి నియోజకవర్గంలో తన ఓటమికి జేడీఎస్ కారణమనే కక్షతోనే సిద్ధరామయ్య ఇదంతా చేశారని ఆరోపించారు.

లోక్ సభ ఎన్నికల్లో మండ్యా నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి సుమలత గెలుపుకు సిద్ధరామయ్య సహకరించారని... తన మనవడు నిఖిల్ ఓటమిపాలయ్యేలా చేశారని దేవెగౌడ అన్నారు. రాజకీయ ద్వేషంతో తమ కుటుంబంపై కుతంత్రాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రానున్న రోజుల్లో అంతకంతా అనుభవించక తప్పదని అన్నారు. ఆయన మనసులో ఇంత విషం ఉందనే విషయాన్ని తాము గ్రహించలేకపోయామని చెప్పారు. రాహుల్ గాంధీ స్వయంగా ఆహ్వానించడం వల్లే తాము సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.

More Telugu News