Spain: స్పెయిన్ లో విజృంభిస్తున్న లిస్టీరియా వ్యాధి.. ప్రపంచదేశాలను హెచ్చరించిన స్పానిష్ ప్రభుత్వం!

  • ఇప్పటివరకూ 150 కేసులు నమోదు
  • వ్యాధి కారణంగా ఓ పెద్దావిడ మృతి
  • పర్యాటకులకు సోకి ఉండవచ్చని స్పెయిన్ ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే స్పెయిన్ లో ‘లిస్టీరియా’ వ్యాధి విజృంభిస్తోంది. స్పెయిన్ లో ఇప్పటివరకూ 150 మందికి ఈ వ్యాధి సోకగా, ఒకరు చనిపోయారని స్పెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి మారియా లూసా తెలిపారు. ఆగస్టు 15న ఈ వ్యాధి బయటపడిందని వెల్లడించారు. దీని కారణంగా 90 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నారు.  ఈ విషయమై అంతర్జాతీయ హెల్త్ అలర్ట్ జారీచేశామని చెప్పారు. లిస్టీరియా వ్యాధి విషయమై యూరోపియన్ యూనియన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో)కు  సమాచారం ఇచ్చామన్నారు.

‘లా మెచా’ అనే బ్రాండ్ కింద విక్రయిస్తున్న సరిగ్గా ఉడకని మాంసంలో ఈ లిస్టీరియా బ్యాక్టీరియా మూలాలను గుర్తించామని మంత్రి మారియా చెప్పారు.  ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీని మూసివేయడంతో పాటు ఉత్పత్తులను సీజ్ చేశామన్నారు. తమ దేశంలో ఇటీవలి కాలంలో పర్యటించిన టూరిస్టులకు ఈ వ్యాధి సోకిఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. లిస్టీరియా అనే బ్యాక్టీరియా కారణంగా కొంత అస్వస్థతకు లోనవుతారు. అయితే గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారి పాలిట ఈ బ్యాక్టీరియా ప్రాణాంతకంగా మారుతుంది.

More Telugu News