CDS: తొలి 'త్రివిద దళాల అధిపతిగా' గా బిపిన్ రావత్?

  • నిన్న తన ప్రసంగంలో సీడీఎస్ ను ప్రకటించిన మోదీ
  • మోదీ మనసులో రావత్ పేరే ఉన్నదంటున్న అధికారులు
  • నవంబర్ లోగా నియామకానికి అవకాశం

భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనలను ఎప్పటికప్పుడు సమీక్షించేలా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పేరిట కొత్త పదవిని సృష్టిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో వెల్లడించిన వేళ, ఈ పదవిని తొలిసారిగా చేపట్టేందుకు ప్రస్తుత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఫ్రంట్ రన్నర్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పదవి ఎవరికి లభిస్తుందన్న చర్చ నిన్న మోదీ ప్రసంగం తరువాత మొదలుకాగా, దీనికి రావత్ ను ఇదివరకే మోదీ ఎంచుకున్నారని సమాచారం.

కాగా, 1999లో కార్గిల్ యుద్ధం తరువాత త్రివిధ దళాధిపతులకు చీఫ్ గా ఒకరిని నియమించాలని వాజ్ పేయి భావించారు. సైనిక సంబంధిత విషయాల్లో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఓ అధికారి ఉండాలని అప్పట్లో వాజ్ పేయి భావించారు. ఏవైనా ఆపరేషన్స్ కు ప్రణాళికలు, నియామకాలు, శిక్షణ, ఆయుధాల సరఫరా తదితరాల విషయంలో ప్రస్తుతం ఆర్మీ, నేవీ, వాయుసేనలు విడివిడిగా తమ వ్యూహాలను ప్రభుత్వంతో పంచుకుంటున్నాయి. ఇకపై ఈ విధానాన్ని మార్చాలని నిర్ణయించుకున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు సీడీఎస్ పేరిట కొత్త పదవిని సృష్టించింది.

ఇదిలావుండగా, నవంబర్ నాటికి సీడీఎస్ నియామకం పూర్తవుతుందని, ఆయన విధి విధానాలు ఖరారు చేసేందుకు ఓ కమిటీ కూడా ఏర్పాటవుతుందని అధికారులు వెల్లడించారు. వాస్తవానికి ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ బిపిన్ రావత్ తో పోలిస్తే, వాయుసేన చీఫ్ గా ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాకు సీనియారిటీ ఎక్కువ. అయితే, ధనోవా సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఇదే సమయంలో రావత్ పదవీ కాలం డిసెంబర్ 31 వరకూ ఉండటంతో ఆయనే తొలి సీడీఎస్ అని అధికారులు అంటున్నారు.

More Telugu News