Nellore District: నెల్లూరులో అక్రమ కట్టడాలంటూ టీడీపీ నేతల ఇళ్ల కూల్చివేత... తీవ్ర ఉద్రిక్తత!

  • ప్రభుత్వ స్థలంలో నేతల ఇళ్ల నిర్మాణం
  • సరైన పత్రాలతోనే కొన్నామంటున్న నాయకలు
  • కూల్చివేతలతో తీవ్ర ఉద్రిక్తత!

అక్రమ కట్టడాలని ఆరోపిస్తూ, నెల్లూరు నగరం, వెంకటేశ్వరాపురం ప్రాంతంలో అధికారులు, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల ఇళ్లను కూల్చివేస్తుండటంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. జనార్దన్ రెడ్డి కాలనీలో టీడీపీ నేతలకు చెందిన మూడు ఇళ్లను అధికారులు ఈ ఉదయం జేసీబీల సాయంతో కూల్చివేశారు. పోలీసుల బందోబస్తు మధ్య తెల్లవారుజాము నుంచి ఇళ్ల కూల్చివేత ప్రారంభమైంది.

రెవెన్యూ, మునిసిపల్ అధికారులు ఇళ్లను కూల్చేందుకు వచ్చిన వేళ, అప్పటికే అక్కడకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు, వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్యా వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, ఆందోళనకారులను చెదరగొట్టారు. వారు ఇళ్లను నిర్మించిన స్థలం ప్రభుత్వానిదని అధికారులు స్పష్టం చేస్తుండగా, ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇళ్ల కూల్చివేతకు దిగిందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.

తాము సరైన పత్రాలతోనే స్థలం కొనుగోలు చేసి ఇళ్లను నిర్మించామని టీడీపీ నేతలు అంటున్నారు. ఆందోళనకు దిగిన టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సహా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు, పరిస్థితి అదుపు తప్పకుండా ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

More Telugu News