Kerala: కేరళలో సీపీఐ దళిత మహిళా ఎమ్మెల్యేకు ఘోర అవమానం!

  • రోడ్లకు మరమ్మతు చేయాలంటూ పీడబ్ల్యూడీ కార్యాలయం ఎదుట ఆందోళన
  • ఆమె వెళ్లాక గోమూత్రంతో ఆ ప్రాంతాన్ని శభ్రం చేసిన యూత్ కాంగ్రెస్ సభ్యులు
  • వర్ణ వివక్షకు గురయ్యానంటూ ఎమ్మెల్యే ఆవేదన

కేరళలోని సీపీఐ దళిత మహిళా ఎమ్మెల్యే గీతా గోపి వర్ణ వివక్షకు గురయ్యారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన ప్రాంతంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేయాలంటూ త్రిసూర్ జిల్లాలోని ప్రజా పనుల కార్యాలయం (పీడబ్ల్యూడీ) ఎదుట గీతా గోపి ఆందోళన చేపట్టారు. ఆమె ఆందోళనతో దిగొచ్చిన అధికారులు రోడ్లకు మరమ్మతులు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆమె తన ఆందోళనను విరమించుకున్నారు.

ఎమ్మెల్యే ఆ ప్రాంతం నుంచి వెళ్లిన మరుక్షణం అక్కడ వాలిపోయిన యూత్ కాంగ్రెస్ సభ్యులు గీతా గోపికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ప్రజలను ఆమె ఫూల్స్‌ను చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అనంతరం ఆ ప్రాంతాన్ని గోమూత్రం, పేడతో శుభ్రం చేశారు.

విషయం వెలుగులోకి రావడంతో మహిళా ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. తాను వర్ణ వివక్షకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. యూత్ కాంగ్రెస్ సభ్యుల తీరును మంత్రులు ఖండించారు. ఇలాంటి పనులు ఆమోదయోగ్యం కాదన్నారు. గోమూత్రంతో శుభ్రపరిచే ఇలాంటి కార్యక్రమాలు సాధారణంగా ఉత్తర భారతదేశంలో జరుగుతుంటాయని కేరళ సాంస్కృతిక శాఖామంత్రి ఏకే బాలన్ పేర్కొన్నారు. కాగా, తనకు జరిగిన అవమానంపై ఎమ్మెల్యే గీతా గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

More Telugu News