New Zealand: మెరుగైన రన్ రేట్ తో సెమీస్ చేరి.. టీమిండియా ఆశలకు గండికొట్టిన కివీస్!

  • గత వరల్డ్ కప్ లోనూ ఫైనల్ చేరిన కివీస్
  • ఆస్ట్రేలియా చేతిలో ఓటమి
  • వరుసగా రెండో పర్యాయం ఫైనల్ చేరిక

ఇప్పుడు వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టు చర్చనీయాంశంగా మారింది. కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని కివీస్ టీమ్ అన్ని రంగాల్లో బలంగా ఉన్న టీమిండియాను అనూహ్యరీతిలో ఓడించి వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఓ దశలో టోర్నమెంట్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టాల్సి ఉన్నా, మెరుగైన రన్ రేట్ తో పాకిస్థాన్ ను వెనక్కినెట్టి సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. చివరికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ నే ఇంటికి పంపింది.

న్యూజిలాండర్లు 2015 వరల్డ్ కప్ లోనూ ఫైనల్ చేరారు. అయితే ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో రన్నరప్ తో సరిపెట్టుకున్నారు. వరుసగా రెండో పర్యాయం కూడా అంతిమ సమరానికి సిద్ధమైనా, ఈసారి వారి ప్రత్యర్థి ఎవరో ఇంకా తేలలేదు. రేపు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో కివీస్ టైటిల్ మ్యాచ్ ఆడతారు.

న్యూజిలాండ్ జట్టుది ఓ విచిత్రమైన పరిస్థితి. గణనీయమైన విజయాలు ఎన్నో సాధించినా ఓ వరల్డ్ కప్ టైటిల్ లేమి వారిని వేధిస్తోంది. ఇప్పటివరకు ఆ జట్టు ఎనిమిది సెమీఫైనల్స్ ఆడి రెండుసార్లు ఫైనల్ చేరింది. ఈసారి మాత్రం గెలుపును వదలకూడదని కివీస్ భావిస్తున్నారు. ఏం జరుగుతుందన్నది జూలై 14న లార్డ్స్ మైదానంలో తేలనుంది.

More Telugu News