lahore: లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు

  • ఎయిర్ పోర్టు లాంజ్ నుంచి వస్తున్న ప్రయాణికులపై కాల్పులు
  • ఇద్దరు మృతి... ఒకరికి గాయాలు
  • ఉగ్రకోణం లేదన్న పోలీసులు

పాకిస్థాన్ లోని లాహోర్ లో ఉన్న అల్లామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. మక్కా నుంచి తిరిగి వచ్చిన ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ లాంజ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా తుపాకీ గర్జించడంతో అక్కడున్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. కాల్పులకు తెగబడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాల్పులు జరిపిన వ్యక్తి ఒక ట్యాక్సీ ద్వారా ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడని పోలీసులు తెలిపారు. లాంజ్ నుంచి బాధితులు బయటకు వస్తున్న సమయంలో కాల్పులు ప్రారంభించాడని చెప్పారు. కాల్పుల వెనుక ఉగ్రకోణం లేదని... వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ కాల్పులు జరిగి ఉంటాయని తెలిపారు. కాల్పుల నేపథ్యంలో, ఎయిర్ పోర్టుకు వస్తున్న వాహనాలను నిలిపివేశారు. విమానాశ్రయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

More Telugu News