Telangana: యాదాద్రిలో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో పెళ్లైన రెండో రోజే యువకుడు సహా నలుగురి మృతి

  • బట్టలు ఆరేసుకునే తీగకు విద్యుత్ సరఫరా
  • పెళ్లి కుమారుడి తల్లిని రక్షించే క్రమంలో మరో ముగ్గురు మృత్యువాత
  •  పెళ్లి కుమార్తె ఇంటి నుంచి వచ్చిన కాసేపటికే ఘటన

యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో రెండు రోజుల క్రితమే పెళ్లైన యువకుడు కూడా ఉండడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. ముక్తాపూర్‌కు చెందిన  చిందం ప్రవీణ్ (22)కు ఈ నెల 19న వివాహమైంది. శుక్రవారం పెళ్లి కుమార్తె ఇంట్లో శుభకార్యం ముగించుకుని రేవణపల్లి నుంచి ముక్తాపూర్ చేరుకున్నారు.

ఇంటి ముందు వేసిన పెళ్లి పందిట్లో విద్యుత్ బల్బులను అమర్చేందుకు ఓ ఇనుప తీగను ఏర్పాటు చేశారు. దానిని ఓ స్తంభానికి కట్టారు. అదే ఇనుప స్తంభానికి దుస్తులు ఆరేసే తీగను కూడా కట్టారు. పెళ్లి కుమారుడి తల్లి ఇదే తీగపై బట్టలు ఆరేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరిగింది. విద్యుదాఘాతానికి గురైన ఆమెను రక్షించేందుకు వెళ్లిన నలుగురు కూడా షాక్‌కు గురయ్యారు.

ప్రవీణ్ (22), అతడి తండ్రి సాయిలు (55) తల్లి గంగమ్మ (50), పెళ్లి కుమారుడి మేనత్త గంగమ్మ (48)లు షాక్‌తో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని వెంటనే హైదరాబాద్ తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల ముందు పెళ్లి సందడితో కళకళలాడిన ఆ ఇంట్లో ఇప్పుడు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నిండుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News