Donald Trump: భారత్ పై ట్రంప్ కోలులోలేని వాణిజ్య దెబ్బ... రూ. 39 వేల కోట్ల రాయితీ రద్దు!

  • ప్రాధాన్య వాణిజ్య హోదా రద్దు
  • 5వ తేదీ నుంచి అమలులోకి నిర్ణయం
  • ఇక వాణిజ్య రాయితీలు లేనట్టే

ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య దెబ్బ కొట్టారు. భారత్‌ కు కల్పించిన ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ - జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌)ను రద్దు చేస్తున్నట్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం 5వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని అన్నారు. జీఎస్పీ హోదాను కోల్పోవడంతో భారత్‌ కు అమెరికా నుంచి అందే దాదాపు రూ. 39 వేల కోట్ల (560 కోట్ల డాలర్లు) విలువైన వాణిజ్య రాయితీలు ఆగిపోనున్నాయి. భారత మార్కెట్లో అమెరికన్ ప్రొడక్టులకు మంచి అవకాశాలు ఇస్తూ, మేడిన్ ఇండియా ఉత్పత్తులతో సమానంగా యూఎస్ ఉత్పత్తులను చూస్తామన్న హామీని భారత్ ఇవ్వకపోవడమే అమెరికా ఆగ్రహానికి కారణమైందని తెలుస్తోంది.

అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం చాలా సంవత్సరాల నుంచి జీఎస్పీని అమెరికా అమలు చేస్తోంది. ఈ హోదా పొందిన దేశాల నుంచి అమెరికా ఎలాంటి పన్నులనూ విధించకుండా పలు రకాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. ఇక ఇండియా ఆర్థికంగా శరవేగంగా ఎదుగుతున్న వేళ, ఇక్కడ కూడా తమ ఉత్పత్తులను అదే తరహా ప్రోత్సాహాన్ని అమెరికా కోరుతోంది. అమెరికన్ ప్రొడక్టులను సుంకాలు లేకుండా దిగుమతి చేసుకునేందుకు భారత్ ససేమిరా అంటున్న నేపథ్యంలో, "తన మార్కెట్లో అమెరికాకు సమానమైన, సహేతుకమైన అవకాశం కల్పి స్తామని ఇండియా హామీ ఇవ్వదని నేను నిర్ధారణకు వచ్చాను. అందువల్ల భారత్‌ కు గతంలో కల్పించిన జీఎస్పీ హోదాను రద్దుచేస్తున్నాం" అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ట్రంప్ నిర్ణయంపై స్సందించిన భారత్, హోదాను రద్దు చేసినప్పటికీ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల బలోపేతానికి అమెరికాతో కలిసి పని చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఓ ప్రకటన విడుదల చేసింది. జీఎస్పీ హోదా కింద భారత్‌ దాదాపు 2 వేలకు పైగా ప్రొడక్టులను అమెరికాకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా ఎగుమతి చేసేది.

More Telugu News