Telangana: ప్రజలు చందాలు వేసుకుని నన్ను గెలిపించారు.. కవిత నిజామాబాద్ లో అందుకే ఓడిపోయింది!: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశా
  • నాపై ఇన్నేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు
  • మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ

నాలుగు పర్యాయాలు తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశానని కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తన పనితీరు ఏంటో ఈ 20 సంవత్సరాల్లో నల్గొండ జిల్లా ప్రజలు చూశారనీ, అందుకే పార్టీలకు అతీతంగా ఓటేసి గెలిపించుకున్నారని వ్యాఖ్యానించారు. తనను గెలిపించిన ప్రజలందరికీ ఈ సందర్భంగా కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ జిల్లాలో వేల కోట్ల రూపాయలతో ఇరిగేషన్ ప్రాజెక్టులు, యూనివర్సిటీ తీసుకురావడంతో పాటు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టామని పేర్కొన్నారు. ఓ టీవీ ఛానల్  కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి ఈరోజు మాట్లాడారు.

తనకు భువనగిరి లోక్ సభ సభ్యుడిగా ప్రజలు సరికొత్త బాధ్యతను అప్పగించారని కోమటిరెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ మరో 5 సంవత్సారాలు అధికారంలోకి ఉంటుందని తెలిసి కూడా ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు విరాళాలు వేసుకుని తనను గెలిపించారని వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్ బిడ్డ కవిత నిజామాబాద్ లో, సొంతఊరిలో చెల్లకుండా పోయింది. ఇయాల నేను భువనగిరిలో చెల్లిన అంటే నేను రూపాయిని కాదు. మేలిమి బంగారాన్ని. తెలంగాణ కోసం నేను మంత్రి పదవిని త్యాగం చేశా. ఇన్నేళ్లలో నాపై కనీసం ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా? అదే కేటీఆర్, కవితల మీద వేలకోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అందుకనే వాళ్లు ఓడిపోయినరు. నేను గెల్చిన. పార్లమెంటు సభ్యుడంటే ఇలా ఉండాలే అని దేశమంతా గర్వంగా చెప్పుకునేలా పనిచేస్తా’ అని కోమటిరెడ్డి మాట ఇచ్చారు.

More Telugu News