Arnold Schwarzenegger: అభిమానుల మధ్యలో ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ పై దాడి.. ఫన్నీగా స్పందించిన హాలీవుడ్ స్టార్!

  • దక్షిణాఫ్రికాలోని  జోహన్నెస్ బర్గ్ లో ఘటన
  • ఆర్నాల్డ్ క్లాసిక్ ఆఫ్రికా సదస్సులో పాల్గొన్న నటుడు
  • వెనుక నుంచి ఎగిరి తన్నిన ఓ వ్యక్తి.. కేసు పెట్టని స్క్వాజ్ నెగ్గర్

ప్రముఖ హాలీవుడ్ నటుడు, టెర్మినేటర్ ఫేమ్ ఆర్నార్డ్ స్క్వాజ్ నెగ్గర్(71) కు చేదు అనుభవం ఎదురయింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనపై ఓ యువకుడు దాడి చేశాడు. పరుగెత్తుకుంటూ వచ్చి రెండు కాళ్లతో ఆర్నాల్డ్ పై ఎగిరి తన్నాడు. అయితే ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ కొంచెం ముందుకు తూలగా, ఇతను మాత్రం నేలపై పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

జోహన్నెస్ బర్గ్ లో గత శుక్రవారం ఆర్నాల్డ్ క్లాసిక్ ఆఫ్రికా వార్షిక సదస్సు జరిగింది. దీనికి దాదాపు 24,000 మంది అథ్లెట్లతో పాటు స్క్వాజ్ నెగ్గర్ కూడా హాజరయ్యారు. అభిమానులు, అథ్లెట్లతో కలిసి స్నాప్ చాట్ వీడియోలు రికార్డు చేస్తున్నారు. అంతలోనే ఓ యువకుడు వెనుక నుంచి పరుగెత్తుకుంటూ వచ్చాడు. రెండు కాళ్లతో ఎగిరి ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ వీపుపై దాడిచేశాడు. ఒక్కసారిగా ముందుకు తూలిపడ్డ ఆర్నాల్డ్.. షాక్ కు గురయ్యారు.

అతడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్న అనంతరం ఆర్నాల్డ్ తన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆర్నాల్డ్ మాట్లాడుతూ..‘ఆ ఇడియట్ నా స్నాప్ చాట్ కార్యక్రమాన్ని చెడగొట్టనందుకు సంతోషిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. సదరు వ్యక్తిపై కేసు పెట్టేందుకు స్క్వాజ్ నెగ్గర్ నిరాకరించారు. ఓ పిచ్చి ఫ్యాన్ చేసిన అనుచిత చర్యగా దాడిని అభివర్ణించారు. తాను వీడియో చూశాకే తనపై దాడి జరిగినట్లు అర్థమయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News