nathram gadse: నాథూరాం గాడ్సే ఒకరినే చంపాడు.. రాజీవ్ గాంధీ 17,000 మందిని పొట్టనపెట్టుకున్నారు!: బీజేపీ నేత నలిన్

  • వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక నేత
  • కసబ్ కేవలం 72 మందినే చంపాడని వ్యాఖ్య
  • తలంటిన నెటిజన్లు.. ట్వీట్ ను తొలగించిన బీజేపీ నేత

భారత జాతిపిత మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సేను బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కీర్తించిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో చివరికి దిగివచ్చిన ప్రజ్ఞా.. దేశప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాజాగా మరో బీజేపీ నేత ఈరోజు నోరు పారేసుకున్నారు. నాథూరాం గాడ్సే కేవలం ఒక్కరినే చంపాడనీ, కానీ కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ ఏకంగా 17,000 మందిని పొట్టనపెట్టుకున్నారని కర్ణాటక బీజేపీ నేత నలిన్ కుమార్ కతీల్ ఆరోపించారు.

‘నాథూరాం గాడ్సే ఒకరినే చంపాడు, ముంబై మారణహోమంలో పాక్ ఉగ్రవాది కసబ్ 72 మంది అమాయకులను హతమార్చాడు. కానీ రాజీవ్ గాంధీ ఏకంగా 17,000 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ మూడు ఘటనల్లో ఎవరు క్రూరులో మీరే నిర్ణయించుకోండి’ అని ప్రజలను ఉద్దేశించి నలిన్ కుమార్ ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఇది వైరల్ గా మారింది.

దీంతో బీజేపీ నేతపై పలువురు నెటిజన్లు మండిపడ్డారు. ఇదేం పద్ధతి అని తలంటారు. చివరికి నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో నలిన్ గుట్టుచప్పుడు కాకుండా తన ట్వీట్ ను తొలగించారు. అయితే రాజీవ్ గాంధీ 17 వేల మంది ప్రజలను ఎలా పొట్టన పెట్టుకున్నారన్న విషయమై నలిన్ తన ట్వీట్ లో స్పష్టత ఇవ్వలేదు.

More Telugu News