Telangana: శ్రావణి రేప్, మర్డర్ కేసు.. ఎస్ఐ వెంకటయ్యపై కొరడా ఝుళిపించిన డీసీపీ!

  • తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో ఘటన
  • బాలిక మృతదేహం బావిలో గుర్తింపు
  • నేరస్తులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని గ్రామస్తుల ఆందోళన

యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం ఆచూకీ తెలియకుండా పోయిన బాలిక శ్రావణి(14) దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. జిల్లాలోని బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బాలిక ఓ బావిలో శవమై తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు పోలీసులపై తిరగబడ్డారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన డీసీపీ కొరడా ఝుళిపించారు. శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం వహించిన బొమ్మలరామారం ఎస్ఐ వెంకటయ్యపై వేటు వేశారు.

ఆయన్ను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.హాజీపూర్‌ గ్రామానికి చెందిన పాముల నర్సింహ, నాగమణిల కుమార్తె శ్రావణి (14) మేడ్చల్‌ జిల్లా కీసర మండలంలోని సెరినిటీ మోడల్‌ స్కూల్‌లో 9వ తరగతి పూర్తి చేసింది. పదో తరగతికి వెళ్లనున్న శ్రావణికి పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. స్పెషల్‌ క్లాస్‌ల కోసమని ఐదు రోజులుగా హాజీపూర్‌నుంచి ఉదయం 7 గంటలకు శ్రావణిని కుటుంబ సభ్యులు బైక్‌పై బొమ్మలరామారం మండల కేంద్రం వరకు దిగబెట్టేవారు.

క్లాస్‌ల నిర్వహణ 11 గంటల వరకు జరిగేది. అనంతరం శ్రావణి మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట ప్రాంతంలో బొమ్మలరామారం మండల కేంద్రం వరకు ఆటోలో వచ్చి హాజీపూర్‌ వరకు ఎవరైనా గ్రామస్తులు కలిస్తే లిఫ్ట్‌ అడిగి ఇంటికి వెళ్లేది. అయితే గురువారం మధ్యాహ్నం 3 గంటలైనా బాలిక ఇంటికి రాలేదు. చివరికి రాత్రి 11 గంటల సమయంలో హాజీపూర్ సమీపంలోని పాటుబడిన బావిలో శ్రావణి మృతదేహాన్ని గుర్తించారు. శ్రావణిని అత్యాచారం చేసిన అనంతరం కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

More Telugu News