trailer: మమత బెనర్జీ బయోపిక్ ట్రైలర్‌ను వెబ్‌సైట్ల నుంచి తొలగించిన ఈసీ

  • ఇప్పటికే ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాపై నిషేధం
  • ‘బాఘిని’ తన బయోపిక్ కాదన్న మమత
  • పుకార్లు సృష్టించే వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్రమోదీ’ విడుదలపై నిషేధం విధించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బయోపిక్ ‘బాఘిని’పై కొరడా ఝళిపించింది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ధ్రువీకరణ లేదన్న ఈసీ సినిమాకు సంబంధించిన ట్రైలర్లను మూడు వెబ్‌సైట్ల నుంచి తొలగించింది.

మరోపక్క పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత దీనిపై స్పందిస్తూ, తన జీవిత కథతో రూపొందించినట్టు చెబుతున్న సినిమాతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఈ విషయంలో పుకార్లు ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తనపై బయోపిక్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ‘నాన్సెన్స్’ అంటూ కొట్టిపడేసిన మమత.. కొందరు కొన్ని కథలను సేకరించి దానిని సినిమాల ద్వారా వ్యక్తీకరించడం అది వారికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. దానితో తనకు సంబంధం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తాను నరేంద్రమోదీని కాదని, దయచేసి పుకార్లు సృష్టించి పరువునష్టం వేసే స్థితికి తీసుకెళ్లవద్దని మమత హెచ్చరికలు జారీ చేశారు.

More Telugu News