Sri Lanka: శ్రీలంకలో ప్రాణాలతో బయటపడ్డ 18 మంది ఏపీ భక్తులు

  • పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు ఏలూరు నుంచి వెళ్లిన భక్తులు
  • పేలుళ్లు జరగడానికి ముందు రోజు కొలంబోలో బస
  • జాఫ్నాకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డ వైనం

శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో 310 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అదృష్టం బాగుండి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నవారి వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ అదృష్టవంతుల్లో ఏలూరుకు చెందిన 18 మంది వ్యక్తులు కూడా ఉన్నారు. శ్రీలంకలోని ట్రింకోమలి శక్తిపీఠం సందర్శనకు వీరంతా వెళ్లారు. ఏలూరు, పరిసర ప్రాంతాలకు చెందిన వీరు కొలంబో, ట్రింకోమలి, జాఫ్నా, అశోకవనం తదితర క్షేత్రాలను దర్శించేందుకు ఈనెల 18న వెళ్లారు. వీరంతా సురక్షితంగా ఉన్నారు. ఈరోజు వారు తిరిగివచ్చే అవకాశం ఉంది.

భక్త బృందంలోని మురళీకృష్ణ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, బాంబు పేలుళ్లు జరగడానికి ముందు రోజున తామంతా కొలంబోలోని హోటల్ లో ఉన్నామని చెప్పారు. భగవంతుని దయవల్ల శనివారం రాత్రి అక్కడి నుంచి జాఫ్నాకు బయల్దేరామని, ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు. మరోవైపు, ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 15 మంది భక్తులు కూడా శ్రీలంకలో ఉన్నట్టు సమాచారం.

More Telugu News