TTD: బంగారం ఎలా వస్తే ఏంటి? మాకు అందడం ముఖ్యం!: టీటీడీ ఈవో సింఘాల్

  • టీటీడీ బంగారం తరలింపు వివాదంపై సింఘాల్ స్పందన
  • మిగిలిన విషయాల గురించి మాకు అవసరం లేదు
  • పీఎన్బీ అధికారులు ఏప్రిల్ 18కి బదులు 20న బంగారం అందజేశారు

తిరుమల తిరుపతి దేవస్థానం బంగారం తరలింపు వివాదంపై విచారణకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్ దీనిపై విచారణ చేయనున్నారు. విచారణ నిమిత్తం మన్మోహన్ సింగ్  తిరుమలకు వస్తున్న సందర్భంగా ‘మీరేం చేయబోతున్నారు?’ అన్న ప్రశ్నకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పందిస్తూ, తానేం చేయబోతున్నానన్నది మీడియాకు చెప్పాల్సిన విషయం కాదని అన్నారు.

గోల్డ్ డిపాజిట్ స్కీమ్ 2000 ఏప్రిల్ 1న ప్రారంభమైందని  టీటీడీకి సంబంధించిన బంగారం ఎస్బీఐలో 5,387 కిలోలు, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1381 కిలోలు డిపాజిట్ చేశామని చెప్పారు. ఏప్రిల్ 18,2016లో మూడేళ్ల కాల వ్యవధికి పీఎన్బీలో ఈ బంగారం డిపాజిట్ చేశామని, ఈ నెల18కి మెచ్యూరిటీ అయినట్టు చెప్పారు. మెచ్యూరిటీ అంశంపై గత నెల 27నే పీఎన్బీకి ఓ లేఖ రాశామని, ఏప్రిల్ 18 నాటికి బంగారం తమకు చేరాలని కోరినట్టు  గుర్తుచేశారు.

టీటీడీకి సంబంధించిన బంగారం తరలించే ముందు రోజున ‘రేపు తీసుకొస్తామంటూ’ పీఎన్బీ అధికారులు తమకు ఫోన్ చేసి చెప్పారని అన్నారు. చెన్నైలో టీటీడీ బంగారం తరలిస్తున్న వాహనాన్ని ఎన్నికల సంఘం అధికారులు సీజ్ చేసిన సమయంలో సంబంధిత డాక్యుమెంట్లు ఉన్నాయని పీఎన్బీ చెప్పిందని, ఆ విషయాన్ని అధికారులు తమకూ ఫోన్ ద్వారా చెప్పారని అన్నారు. ఈసీ అధికారులకు వాళ్లు ఏ డాక్యుమెంట్లు చూపారో తమకు తెలియదని  చెప్పారు. ఏప్రిల్ 18కి బదులు ఏప్రిల్ 20న టీటీడీకి బంగారం అందజేశారని, బంగారం తమకు చేరే విషయం గురించి మాత్రమే ఆలోచిస్తాం తప్ప, మిగిలిన విషయాల గురించి తమకు అవసరం లేదని అన్నారు. బంగారం ఎలా వస్తే ఏంటి? మాకు బంగారం అందిందా? లేదా? అనేది ముఖ్యమని సింఘాల్ పేర్కొన్నారు.

More Telugu News