West Godavari District: జైలుకెళ్లొచ్చిన జగన్ ఫొటోలు ఎలా పెట్టుకుంటారు?: పవన్ కల్యాణ్

  • అధికారం కోసం జగన్ తాపత్రయం
  • లక్ష మంది యువరైతులను తయారు చేస్తా
  • తాడేపల్లిగూడెంను స్మార్ట్ సిటీగా చూడాలని ఉంది

ప్రజలు తన ఫొటో ఇళ్లలో పెట్టుకోవాలని జగన్ కోరుకుంటున్నారని, రెండేళ్లు జైలుకు వెళ్లొచ్చిన ఆయన ఫొటోలు ఎలా పెట్టుకుంటారు? అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, తండ్రి మృతదేహం పక్కనున్నాఅధికారం కోసం జగన్ తాపత్రయ పడ్డారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ‘జనసేన’ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వాటిని భర్తీ చేస్తామని, లక్ష ఎకరాల భూమి సేకరించి లక్ష మంది యువరైతులను తయారు చేస్తానని హామీ ఇచ్చారు.

యువతకు పెద్ద చదువులు అక్కర్లేదని, కష్టపడే తత్వం ఉంటే చాలని, పదో తరగతి పాసైన యువతను స్పెషల్ ఫోలీస్ కమాండోస్ గా నియమిస్తామని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇస్తామని, చిన్న, ఫుట్ పాత్ వ్యాపారులకు పూచీకత్తు లేకుండా రూ.10 వేలు రుణం కింద ఇస్తామని ఇంటర్ మీడియట్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు అందజేస్తామని హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెంను స్మార్ట్ సిటీగా చూడాలని ఉందని పవన్ ఆకాంక్షించారు.

స్వచ్ఛ భారత్ కోసం తన ఫొటోలు కావాలని బీజేపీ నేతలు అడిగారని, ఫొటోల కోసం డ్రామాలు ఆడలేనని వారికి చెప్పిన విషయాన్ని పవన్ గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో ఉన్న చెత్తను ఊడ్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని మరోసారి స్పష్టం చేసిన పవన్, తనకు పార్టీల కంటే సమాజం అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పడం గమనార్హం.

More Telugu News