Karnataka: కర్ణాటకలో మంత్రి రేవణ్ణ, కాంట్రాక్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు!

  • మంత్రి రేవణ్ణ ఇల్లు, కార్యాలయంలో సోదాలు
  • తీవ్రంగా మండిపడ్డ ముఖ్యమంత్రి కుమారస్వామి
  • మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శ

లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో జేడీఎస్ నాయకుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ  దాడులు నిర్వహించింది. నిన్న రాత్రి నుంచి మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ నిర్వహిస్తున్న పౌరసరఫరాల శాఖలో అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రేవణ్ణ అనుచరులు, ముగ్గురు కాంట్రాక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు.

మరోవైపు ఈ వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తమను బెదిరించడానికే ప్రధాని మోదీ ఇలాంటి ప్రతీకార చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఐటీ అధికారి బాలకృష్ణ ఆయనకు సహకరిస్తున్నారని దుయ్యబట్టారు. జేడీఎస్, కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు చేయిస్తూ మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఐటీ దాడులు జరగొచ్చని కుమారస్వామి వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఆదాయపు పన్ను శాఖ కర్ణాటకలో సోదాలు నిర్వహించడం గమనార్హం.

More Telugu News