Andhra Pradesh: ప్రతీ ఊరికి 10 ఉద్యోగాలు ఇస్తాం.. ప్రభుత్వ పథకాలన్నీ డోర్ డెలివరీ చేస్తాం!: వైఎస్ జగన్

  • ప్రత్యేకహోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారు
  • జాబు రావాలంటే బాబు పోవాల్సిందే
  • పలాస బహిరంగ సభలో వైసీపీ అధినేత

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఆరోజు జాబు రావాలంటే బాబు రావాలని చెప్పారనీ, ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాలని వ్యాఖ్యానించారు. ఏపీలో 1.7 కోట్ల ఇళ్లు ఉంటే, ఉద్యోగాలు లేని యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2,000 ఇస్తామని హామీ ఇచ్చారనీ, దాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రజలందరి దీవెనలతో అధికారంలోకి రాగానే ఎన్ని లక్షలు ఖర్చయినా వెనకాడకుండా పిల్లలను చదవిస్తామనీ, ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.

2014లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి ఆరోజు లెక్కల ప్రకారం, 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని జగన్ తెలిపారు. ‘ఆనాటి నుంచి మన రాష్ట్ర యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్‌ తీసుకుంటూ డబ్బులు ఖర్చుపెడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఖాళీలున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఏటా 10వ తరగతి పాస్‌ అయ్యేవారు 5 లక్షల మంది ఉన్నారు. 4 లక్షల మంది ఇంటర్‌ పాస్‌ అవుతున్నారు. 1.8 లక్షల మంది ఏటా డిగ్రీ పాసై బయటకు వస్తున్నారు. ప్రతీ సంవత్సరం 1.10 లక్షల మంది పీజీ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. వీరందరికి ఉద్యోగాలు కల్పించేలా కార్యచరణ రూపొందిస్తాం‘ అని జగన్ ప్రకటించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఊరి సచివాలయంలో 10 మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. ‘గ్రామంలోని 50 ఇళ్లకు ఒక వలంటీర్ ను పెడతాం. వారికి రూ.5,000 గౌరవ వేతనం అందిస్తాం. మెరుగైన ఉద్యోగం వచ్చే వరకు వాళ్లంతా ఈ ఉద్యోగం చేయవచ్చు. ఆ గ్రామ వలంటీర్ గ్రామ సెక్రటరీయేట్‌తో అనుసంధానమై పనిచేస్తారు. ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఆ యాబై ఇళ్లకు డోర్‌ డెలివరీ చేస్తారు. ప్రభుత్వ పథకాల కోసం ఎవ్వరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే పరిష్కరిస్తాం. ప్రతి జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యం పెంచేందుకు స్కిల్‌డెవలెప్‌మెంట్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. నవరత్నాల్లో ఇవన్నీ వివరించడం జరిగింది. మన జీవితాలు బాగుపడాలంటే నవరత్నాలు ప్రతి ఇంటికి వెళ్లాలి’ అని జగన్ అభిప్రాయపడ్డారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో హత్యలు, మోసాలు, కుట్రలు చూస్తున్నామని జగన్ మండిపడ్డారు. ‘‘వీళ్లే హత్యలు చేస్తారు. వీళ్లే విచారణ జరిపిస్తారు. వక్రీకరించడానికి వీళ్ల మీడియా ఉంది. చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనపై ఎన్నికలకు రావడం లేదు. హత్యారాజకీయాలతో వస్తున్నారు. రాబోయే రోజుల్లో మూటలుమూటలు డబ్బులు పంపిస్తాడు. మూడు వేలు ఇస్తాడు. మీ అందరికి చెప్పేది ఒక్కటే.. గ్రామాల్లోని ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లండి.. ‘చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దు.. అన్నను సీఎంను చేసుకుందాం’ అని చెప్పండి.

నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని వివరించండి. అన్న సీఎం అయితే మన బతుకులు బాగుపడతాయని వివరించండి. పలాస నియోజకవర్గం నుంచి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌లకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని జగన్ ప్రజలను కోరారు.

More Telugu News