Andhra Pradesh: వీరశివారెడ్డికి చంద్రబాబు ఫోన్.. మెత్తబడ్డ కడప టీడీపీ నేత!

  • కడప జిల్లా కమలాపురం టికెట్ విషయంలో రగడ
  • పుత్తా నరసింహారెడ్డికి టికెట్ ఇచ్చిన చంద్రబాబు
  • మనస్తాపంలో వైసీపీలోకి వెళ్లేందుకు శివారెడ్డి యత్నం

ఆంధ్రప్రదేశ్ లోని కమలాపురం సీటును టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పుత్తా నరసింహారెడ్డికి కేటాయించారు. దీంతో తన రాజకీయ ప్రత్యర్థికి అధిష్ఠానం అవకాశమివ్వడంపై వీరశివారెడ్డి మనస్తాపం చెందారు. టీడీపీనీ వీడి వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు ఈరోజు శివారెడ్డికి ఫోన్ చేశారు. కడప లోక్ సభ, కమలాపురం అభ్యర్థుల విజయానికి కృషి  చేయాలని సూచించారు. టికెట్ దక్కలేదని బాధపడొద్దనీ, ఈసారి ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు.

దీంతో మెత్తబడ్డ వీరశివారెడ్డి పార్టీ వీడే ఆలోచనను విరమించుకున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు తనకు ఫోన్ చేశారనీ, పార్టీ విజయం కోసం పనిచేయాల్సిందిగా సూచించారని తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందున తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.

కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డితో కలిసి పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు. అంతకుముందు చంద్రబాబు జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య సయోధ్య కుదర్చిన సంగతి తెలిసిందే. ఆదినారాయణ రెడ్డి కడప నుంచి, రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ సీటు నుంచి పోటీచేసేలా చంద్రబాబు ఇరువురు నేతలను ఒప్పించారు.

More Telugu News