Karnataka: సీఆర్పీఎఫ్ జవాన్ చనిపోయిన 13 రోజులకే.. భార్యకు అత్తింటిలో వేధింపులు.. మరిదిని పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి!

  • కర్ణాటకలోని మాండ్యాలో ఘటన
  • ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హెచ్.గురు
  • కోడలికి అందే నష్టపరిహారంపై అత్తింటివారి కన్ను

ఓ సీఆర్పీఎఫ్ జవాన్ చనిపోయిన 13 రోజులకే అతని భార్యకు అత్తవారింట్లో వేధింపులు మొదలయ్యాయి. ప్రభుత్వం ఇవ్వబోయే భారీ నష్టపరిహారం సొంతం చేసుకోవడం కోసం ఆమెను సొంత మరిదికి ఇచ్చి వివాహం చేసేందుకు అత్తామామలు సిద్ధమయ్యారు. ఈ పెళ్లికి ఒప్పుకోవాలని ఆమెపై తీవ్రంగా ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. చివరికి ఈ వేధింపులు హద్దు దాటడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యాలో చోటుచేసుకుంది.

మాండ్యాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ హెచ్.గురు ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరుడయ్యారు. ఈ ఘటన అనంతరం పలువురు వ్యక్తులు సీఆర్పీఎఫ్ జవాన్లకు సాయం ప్రకటించారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం అందనుంది. ఈ నేపథ్యంలో ఆ మొత్తం నగదు దక్కించుకునేందుకు వీలుగా గురు కుటుంబ సభ్యులు పావులు కదిపారు.

మరిదిని పెళ్లి చేసుకోవాలని గురు భార్య కళావతి(25)పై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి వేధింపులు హద్దుదాటడంతో ఆమె మాండ్యా పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు కళావతికి ఉద్యోగం కల్పించాలని సంబంధిత అధికారులను కర్ణాటక సీఎం కుమారస్వామి ఆదేశించారు.

More Telugu News