Rajasthan: యాచకురాలి దానగుణం: మరణానంతరం పుల్వామా అమరులకు లక్షల విరాళం!

  • రూపాయి రూపాయి కూడబెట్టిన యాచకురాలు
  • ఆ సొమ్ము దేశానికి ఉపయోగపడాలని కోరిక
  • ఆమె కోరికను తీర్చిన నామినీలు

ఆమె ఓ యాచకురాలు. ఓ గుడి ముందు కూర్చుని ఎండకు ఎండి, వానకు తడిసి రూపాయి రూపాయి కూడబెట్టింది. రోజంతా సంపాదించిన సొమ్మును ఓ బ్యాంకులో జమచేసేది. ఆ సొమ్ముకు ఇద్దరు వ్యక్తులను నామినీలుగా పేర్కొంది. తన మరణానంతరం ఆమె సొమ్ము వారికి చెందేలా చేసింది. గతేడాది ఆగస్టులో ఆమె చివరి శ్వాస విడిచింది. ఇప్పుడామె సొమ్ము పుల్వామా అమరులకు చేరి మరణానంతరం గొప్ప దాతగా పేరుతెచ్చుకుంది.

ఆ యాచకురాలి పేరు నందినీ శర్మ. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన ఆమె భజరంగడ్‌లోని అంబె మాత మందిర్ వద్ద కూర్చుని రోజూ యాచించేది. అలా సంపాదించిన సొమ్మును రోజూ బ్యాంకులో జమచేసేది. ఆ సొమ్ము మొత్తం రూ.6.61 లక్షలు అయింది. బ్యాంకులో దాచిన తన సొమ్ముకు ఇద్దరు వ్యక్తులను నామినీలుగా ఉంచింది.

గతేడాది ఆమె చనిపోయిన దగ్గరి నుంచి ఆ సొమ్ము బ్యాంకులోనే ఉంది. దానిని విరాళంగా ఇవ్వాలని నామినీలుగా ఉన్న ఆ ఇద్దరు ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అందించాలని నిర్ణయించారు. పుల్వామా అమరులకు ఆమె సొమ్మును అందించడం ద్వారా నందినీ శర్మకు ఘనంగా నివాళులర్పించినట్టు అవుతుందని భావించారు.  

అనుకున్న వెంటనే ఆ సొమ్మును తీసుకెళ్లి కలెక్టర్ విశ్వమోహన్ శర్మకు అందించి అమరుల కుటుంబాలకు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా నామినీల్లో ఒకరైన సందీప్ గౌర్ మాట్లాడుతూ.. యాచకురాలిగా తను సంపాదించిన సొమ్ము దేశానికి ఉపయోగపడాలని ఆమె భావించేదని, అమరుల కుటుంబాలకు ఆ సొమ్మును విరాళంగా ఇచ్చి ఆమె కోరికను నెరవేర్చినట్టు చెప్పారు.  

More Telugu News