imran khan: మాకందరికీ ఎంతో ఇష్టమైన దేశం పాకిస్థాన్: సౌదీఅరేబియా యువరాజు ప్రశంసలు

  • ఇమ్రాన్ లాంటి నాయకుడి కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం
  • ఆర్థిక, రాజకీయ, భద్రత అంశాల్లో పాక్ తో కలసి పని చేస్తాం
  • మేము మతాన్ని విశ్వసిస్తాం

పాకిస్థాన్ పర్యటనలో ఉన్న సౌదీఅరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆ దేశంపై ప్రశంసలు కురిపించారు. సౌదీ ప్రజలందరికీ పాకిస్థాన్ ఎంతో ఇష్టమైన దేశమని చెప్పారు. కష్టసుఖాల్లో ఇరు దేశాలు కలిసి ముందుకు సాగాయని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ లాంటి నాయకుడి కోసం తాము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నామని చెప్పారు. అనేక అంశాల్లో పాకిస్థాన్ తో భాగస్వాములమవుతామని తెలిపారు.

రానున్న రోజుల్లో తమకు పాకిస్థాన్ అత్యంత ప్రాధాన్యత గల దేశంగా మారబోతోందని సల్మాన్ అన్నారు. గొప్ప నాయకుడి నేతృత్వంలో పాక్ అభివృద్ధి వైపు అడుగులు వేయబోతోందని చెప్పారు. ఆర్థిక, రాజకీయ, భద్రత అంశాల్లో పాక్ తో కలసి పని చేస్తామని తెలిపారు. తాము మతాన్ని విశ్వసిస్తామని.. అందుకే తాము దాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెడతామని చెప్పారు. 2017లో యువరాజుగా తాను పట్టాభిషిక్తుడనైన తర్వాత తూర్పు దిశగా ఇదే తన తొలి పర్యటన అని, తాను పర్యటించిన తొలి దేశం పాకిస్థాన్ అని తెలిపారు.

పాక్ ప్రధాని ఇమ్రాన్ తో కలసి సల్మాన్ విందులో పాల్గొన్నారు. అంతకు ముందు ఇరు దేశాల మధ్య 20 బిలియన్ డాలర్ల విలువైన ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. పెట్రో కెమికల్స్, క్రీడలు, సౌదీ ఉత్పత్తులు దిగుమతులు, పవర్ ప్రాజెక్టులు, రెనెవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల ఆధునికీకరణ తదితర అంశాలపై ఒప్పందాలు చేసుకున్నాయి.

More Telugu News