Karnataka: వీర జవాన్ గురు కుటుంబానికి అరఎకరం భూమి ఇస్తా: ప్రముఖ నటి సుమలత

  • కుమారుడు అభిషేక్ డెబ్యూ చిత్రం షూటింగ్ విదేశాల్లో 
  • అక్కడి నుంచి రాగానే జవాన్ కుటుంబాన్ని కలుస్తా
  • సంబంధిత భూమి పట్టాను అందజేస్తా

జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనలో అసువులు బాసిన వీరజవాన్ గురు స్వస్థలం కర్ణాటకలోని మాండ్యా. గురు అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించింది. ఇదిలా ఉండగా, దివంగత రాజకీయ నేత, నటుడు అంబరీష్ స్వస్థలం కూడా మాండ్యానే. మాండ్యా ఆడపడుచుగా వీరజవాన్ గురుకు తన వంతు సాయం చేయాలని అంబరీష్ భార్య, ప్రముఖ నటి సుమలత నిర్ణయించుకుంది.

తన కుమారుడు అభిషేక్ డెబ్యూ చిత్రం షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం మలేషియాలో ఉన్న ఆమె, గురు అంత్యక్రియలు నిర్వహించడానికి ముందు ఓ ప్రకటన చేసింది. అతని అంత్యక్రియల నిర్వహణకు స్థలం కేటాయించే విషయమై ఇబ్బందులు ఉన్నాయని తనకు తెలిసిందని, వీరజవాన్ త్యాగానికి ఫలితంగా అతనికి ఘనంగా వీడ్కోలు పలకడమే మనం ఇచ్చే గౌరవమని పేర్కొంది.

అతని అంత్యక్రియలు నిర్వహించి, స్మారక చిహ్నాన్ని నిర్మించే నిమిత్తం అర ఎకరం భూమి ఇస్తానని హామీ ఇచ్చింది. అయితే, ఈలోపే గురు అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ విషయం తెలుసుకున్న సుమలత మలేషియా నుంచి మీడియాతో మాట్లాడుతూ, గురు అంత్యక్రియలు నిర్వహించారన్న విషయం తెలిసిందని, అయినప్పటికీ, అతని కుటుంబానికి ఇస్తానని ముందుగా చెప్పిన అరఎకరం భూమిని, మలేషియా నుంచి రాగానే, సంబంధిత భూమి పట్టాను అతని కుటుంబ సభ్యులను కలిసి అందజేస్తానని తెలిపింది.

More Telugu News