wife: నా భార్యను చంపేయ్.. పొరపాటున పోలీసుకే సుపారీ ఇచ్చిన భారత సంతతి వ్యక్తి!

  • అమెరికాలోని న్యూజెర్సీలో ఘటన
  • విడాకుల కేసుతో విసిగిపోయిన భర్త
  • ప్రియురాలితో కలిసి భార్య హత్యకు స్కెచ్

విడాకుల విషయంలో భార్య వ్యవహారశైలితో విసిగిపోయిన ఓ భారత సంతతి వ్యక్తి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆమెను చంపేందుకు కాంట్రాక్టు కిల్లర్ కు సుపారీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ చివరికి పోలీసులు పన్నిన ఉచ్చులో పీకల్లోతు చిక్కుకుపోయాడు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది.

యూఎస్ లోని ఇండియానాకు చెందిన నర్సన్ లింగాల(55)కు 1995లో వివాహమయింది. 2011లో ఆయన విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే భార్యకు భరణం చెల్లించే విషయంలో ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగినా ఆయనకు ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో ఓ కేసులో అరెస్టయిన లింగాల 2018, జూన్ లో మిడిలెసెక్స్‌ కౌంటీ కోర్టుహౌస్‌కు హాజరు అయ్యాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో ఖైదీతో ‘నీకు ఎవరైనా కాంట్రాక్ట్ కిల్లర్ తెలుసా?’ అని ప్రశ్నించాడు. తెలుసని జవాబిచ్చిన సదరు ఖైదీ.. ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశాడు.

దీంతో ఓ అండర్ కవర్ ఏజెంట్ ను అధికారులు కాంట్రాక్ట్ కిల్లర్ గా రంగంలోకి దించారు. అతనితో పలుమార్లు ఫోన్ లో మాట్లాడిన నర్సన్, 2018, జూన్ లో కిల్లర్ ముసుగులో ఉన్న పోలీసును న్యూజెర్సీలోని ఓ షాపింగ్ మాల్ లో కలుసుకున్నాడు. తన జీవితం నుంచి మాజీ భార్య శాశ్వతంగా వెళ్లిపోవాలని నర్సన్ చెప్పాడు. ఇందుకు 10,000 డాలర్లు ఖర్చువుతుందని సదరు ఏజెంట్ నమ్మబలికాడు.

ఈ సమావేశానికి నర్సన్ ప్రియురాలు సంధ్యారెడ్డి కూడా హాజరు అయింది. చివరికి వెయ్యి డాలర్లు అడ్వాన్సుగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అయితే, ఈ తతంగం మొత్తాన్ని రహస్యంగా వీడియో రికార్డ్ చేసిన పోలీసులు.. సమావేశం ముగియగానే వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ నేరం రుజువయితే నర్సన్, సంధ్యారెడ్డికి పదేళ్ల జైలు శిక్ష, 2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశముంది.

More Telugu News